బీజేపీ వాడుకుని వదిలేసింది.. ఆ ఎంపీ పరిస్థితి దారుణం?
రాజకీయాలు రాజకీయాలే. ఎప్పుడు అవసరం ఉంటే.. అప్పుడు రాజకీయాలు టర్న్ తీసుకుంటాయి.
By: Tupaki Desk | 27 May 2024 3:50 AM GMTరాజకీయాలు రాజకీయాలే. ఎప్పుడు అవసరం ఉంటే.. అప్పుడు రాజకీయాలు టర్న్ తీసుకుంటాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకుంటాయి. తర్వాత.. చాటు ముఖం వేస్తాయి. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇలాంటి పరిణామమే ఎదురైంది. ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు.. స్వాతి మాలివాల్ వ్యవహారంలో బీజేపీఒక రేంజ్‌లో స్పందించిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె తమ పార్టీ ఎంపీ కాకపోయినా.. ఆమెకు అన్యాయం చేశారని.. ఆప్ అధినేత కేజ్రీవాల్ మహిళలకు ఇచ్చే విలువ ఇదేనా.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా.. బీజేపీ పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
కీలకమైన నాయకులు నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, ఎస్ . జై శంకర్ వంటివారు కూడా స్వాతి విషయంలో తీవ్రంగా స్పందించారు. దీంతో స్వాతి వీరంతా తన వెంటే ఉన్నారని నమ్మారు. దీంతో ఆమె కూడా మరింత రెచ్చిపోయారు. ఒకవైపు.. తాము పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని.. రాజకీయం చేయొద్దని చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు. పైగా.. సొంత పార్టీ నేతపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు.తనను కార్యాలయంలోనే కొట్టారని.. చెప్పుకోలేని మాటలు అన్నారని.. పీరియడ్స్ అన్నా కూడా వినిపించుకోలేదని పెద్ద ఎత్తున దుమారం రేపేలా వ్యవహరించారు. ఇది నిజమే కావొచ్చు. కానీ.. ఈ యాగీలో ఆప్‌ను ఆమె పలుచన చేసేందుకు బీజేపీని నమ్ముకున్నారు.
ఇదంతా కూడా.. ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు వరకు జరిగింది. ఆరోదశ పోలింగ్‌లో ఢిల్లీలోని ఏడు పార్లమెంటుస్థానాలకు పోలింగ్ జరిగిపోయింది. అంతే.. ఆ తర్వాత నుంచి స్వాతిని ఎవరూ పట్టించుకోలేదు. అంటే.. శనివారం నుంచి స్వాతి మొహం చూసిన వారు.. ఆమె చేసిన ఆరోపణలపై స్పందించిన వారు కూడా కమల నాథుల్లో ఎవరూ లేక పోవడం గమనార్హం. ఇదే విషయంపై తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. మహిళలను అవమానించడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు.
అంతేకాదు.. ఇంతకు మించి ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కూడా షా తేల్చి చెప్పారు. అంటే.. ఇప్పటి వరకు స్వాతి వెనుక నిలిచి.. ఆమెకు అండగా ఉండేలా కలరింగ్ ఇచ్చిన వ్యవహారం అంతా కూడా.. కేవలం ఢిల్లీలో ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని చేసిందనే వాదనను మరింత బల పరుస్తుండడం గమనార్హం. ఏదేమైనా ఈ వ్యవహారంలో .. స్వాతి.. బీజేపీని అవసరానికి మించి ఎంగేజ్ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.