Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రతిజ్ఞ : అయోధ్య అయింది... మధుర మొదలైంది....!

దాంతో ఇపుడు మధుర అని ఆయన అంటున్నారు ఒంటి పూట భోజనమే చేస్తాను అని మరో శపధం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:59 AM GMT
బీజేపీ ప్రతిజ్ఞ : అయోధ్య అయింది... మధుర మొదలైంది....!
X

అయోధ్య రామ జన్మభూమి ఉద్యమాలు అన్నీ కూడా వర్తమాన తరానికి తెలిసిన విషయాలే అయిదు వందల ఏళ్ల చరిత్ర ఈ వివాదానికి ఉందని చెబుతున్నా ఆధునిక రాజకీయాల్లో మాత్రం గత మూడున్నర దశాబ్దాలుగానే నలుగుతోంది ఈ సమస్య. మొత్తానికి 2024 జనవరి 22తో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి అయోధ్యకు ఇక అన్ని శుభాలే అనిపించారు.

ఇక ఇపుడు బీజేపీ అజెండాలో ఏముంది అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వ్యవహారం పూర్తి అయిందో లేదో బీజేపీకి చెందిన రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. మధుర శ్రీకృష్ణుడి జన్మ స్థలం అని అక్కడ కూడా భవ్యమైన దివ్యమైన ఆలయం నిర్మించేటంత వరకూ తాను ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను అని ఆయన అంటున్నారు.

మధురలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మదన్ దిలావర్ ఆరెస్సెస్ మెంబర్. అంతే కాదు ఆయన గతంలో అయోధ్య రామ మందిరం ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాడు కూడా ఆయన ఇలాంటి ప్రతిజ్ఞలు చేశారు. రాముడి కోవెల కట్టాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టేంతవరకూ మెడలో దండ వేసుకోను అని ఆయన శపధం చేశారు. అది ఇప్పటికి నెరవేరింది.

దాంతో ఇపుడు మధుర అని ఆయన అంటున్నారు ఒంటి పూట భోజనమే చేస్తాను అని మరో శపధం చేస్తున్నారు. ఆయన అయోధ్యంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతే కాదు రాం గంజ్ మండీ సిటీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ఢమరుకం వాయిస్తూ అలాగే తాళాలు వాయిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన ర్యాలీలో పాల్గొన్న రామ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయోధ్య తరువాత ఇక మధుర కోసం పోరాటం చేయాల్సిందే అని పిలుపు ఇచ్చారు. అయోధ్యలో రాముడి కోవెలతో కోట్లాది మంది కోరిక తీరిందని అన్నారు. ఇక మిగిలింది క్రిష్ణుడి కోవెల అపుడే హిందువులకు భక్తులకు పూర్తి ఆశయాలు సిద్ధించినట్లు అని ఆయన అంటున్నారు.

ఇక మీదట మధుర ఆలయం కోసం పోరాటం చేద్దామని ఆయన కోరుతున్నారు. అంతవరకూ తనతో పాటు అంతా శ్రీకృష్ణుడి కోసం కదలి రావాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తే రామ జన్మభూమి అయింది ఇక క్రిష్ణ జన్మభూమి ఉందని అంటున్నారు. చూడాలి మరి మధుర ఉద్యమం ఏ విధంగా మొదలవుతుందో మలుపు తిరుగుతుందో.