తండ్రికొడుకులకు బిగ్ షాకిచ్చేలా బీజేపీ ప్లానింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ తో పాటు.. గులాబీ బాస్ మేనల్లుడు హరీశ్ రావులతో సహా ముగ్గురు ముఖ్యుల్ని ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా కొత్త ఎత్తు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 1 Sep 2023 4:48 AM GMTడ్యామేజ్ కంట్రోల్ దిశగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ అధికారపక్షంలో తెర వెనుక చేతులు కలిపి.. కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా ఉండేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారన్న ప్రచారం తెలంగాణలో కమలనాథులకు కరెంటు షాక్ మాదిరి తగిలింది. మొన్నటివరకు ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో.. దిద్దుబాటు చర్యలకు అధినాయకత్వం సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.
తమపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అవన్నీ అబద్ధాలుగా పేర్కొంటూ కొత్త ఎత్తులకు కసరత్తు చేస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ తో తమకున్నది అసలైన రాజకీయ వైరం అన్న విషయాన్ని ఫ్రూవ్ చేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దళానికి దిమ్మ తిరిగేలా వర్కువుట్ చేస్తున్నట్లుగా సంకేతాలు బయటకు పంపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ తో పాటు.. గులాబీ బాస్ మేనల్లుడు హరీశ్ రావులతో సహా ముగ్గురు ముఖ్యుల్ని ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా కొత్త ఎత్తు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురి మీదా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. సుడి తిరిగి గెలిస్తే సంచలనంగా మారుతుందని.. తేడా కొట్టి తమ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయితే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వారిని ఎంపీస్థానాలకు పోటీ చేయించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మీద ఈటల రాజేందర్.. ధర్మపురి అర్వింద్ ను పోటీకి పెట్టాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించిన నేపథ్యంలో.. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను.. కామారెడ్డి నుంచి అర్వింద్ ను బరిలోకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు పార్టీలో జరుగుతున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లే గతంలోనూ ఈటల పలు సందర్భాల్లో తాను వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించటం తెలిసిందే.
ఇక.. మంత్రి కేటీఆర్ మీద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరో మంత్రి హరీశ్ రావుపైన బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన మురళీధరరావును.. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను.. మంత్రి సబిత మీద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. వనపర్తిలో మంత్రి నిరంజన్ మీద మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. కరీంనగర్ లో గుంగుల కమలాకర్ మీద మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డిని.. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డిని బరిలోకి దించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మిగిలిన మంత్రుల మీదా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపటం ద్వారా తమ మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నదే లక్ష్యమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.