Begin typing your search above and press return to search.

బీజేపీ హిందూత్వ కార్డు తీయాల్సిందేనా ?

ఇక మహారాష్ట్రలో 2019లో మొత్తం 48 ఎంపీ సీట్లకు గానూ 41 గెలుచుకున్న బీజేపీ కూటమికి 2024 ఎన్నికల్లో మాత్రం ఆ నంబర్ 30 సీట్లకు పడిపోయింది.

By:  Tupaki Desk   |   26 July 2024 3:38 AM GMT
బీజేపీ హిందూత్వ కార్డు తీయాల్సిందేనా ?
X

బీజేపీ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్న నినాదాన్ని ఎంచుకుంది. అయితే అది అంతలా వర్కౌట్ కాలేదని ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి. బీజేపీకి హార్డ్ కోర్ స్టేట్స్ గా ఉన్న యూపీ వంటి చోట్లనే ఎంపీ సీట్లు మూడో వంతుకి దిగజారాయి. పశ్చిమ బెంగాల్ లో చూస్తే గతసారి 18న్ ఎంపీ సీట్లు వచ్చిన చోట అవి కాస్తా 12కి తగ్గాయి. ఇక మహారాష్ట్రలో 2019లో మొత్తం 48 ఎంపీ సీట్లకు గానూ 41 గెలుచుకున్న బీజేపీ కూటమికి 2024 ఎన్నికల్లో మాత్రం ఆ నంబర్ 30 సీట్లకు పడిపోయింది.

ఆ మీదట జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లో సైతం బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో బీజేపీ ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీ, ఆదివాసి ఇతర బడుగు వర్గాలు ఓబీసీలతో కలసి ఐక్యంగా ముందుకు వస్తోంది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి.

అందువల్లనే ఇండియా కూటమికి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. కుల గణన అన్న అస్త్రాన్ని రాహుల్ గాంధీ ప్రయోగిస్తున్నారు. కుల గణన జరిపి ఆయన వర్గాలకు మరింతగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది గతంలో మండల్ నినాదానికి మారుగా ఉంది.

ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం దేశంలో మండల్ నినాదంతో ఆనాటి దిగ్గజ నేత వీపీ సింగ్ ఒక ఉద్యమాన్ని నడిపారు. దాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ కమండల్ రాజకీయం స్టార్ట్ చేసింది. అలా అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తెచ్చి కుల పరంగా విడిపోయిన హిందూ సమాజాన్ని మత పరంగా ఏకం చేసి భారీ లబ్ధి పొందింది. దాంతో వీపీ సింగ్ ఎత్తులు పారలేదు.

ఇపుడు కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కుల గణన నినాదాన్ని దెబ్బ తీయడానికి ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ మరోసారి కరడు కట్టిన హిందూత్వ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది అని అంటున్నారు. దీని వల్ల హిందూ సమాజం చీలకుండా గుత్తా మొత్తంగా ఓట్లన్నీ బీజేపీకి దక్కుతాయని లెక్క వేసుకుంటోంది.

తొందరలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా వంటి చోట్ల అసెంబ్లీలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు కేంద్రంలోని బీజేపీకి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్న మహారాష్ట్ర అలాగే హర్యానాను దక్కించుకోవాలి. జార్ఖండుని గెలుచుకోవాలి. కనీసంగా రెండు స్టేట్స్ అయినా గెలిస్తే ఎన్డీయే కూటమి స్థిరంగా కేంద్రంలో పాలించడానికి వీలు ఉంటుంది. లేకపోతే మిత్రులు తోక జాడించే ప్రమాదం ఉంటుంది.

ఇండియా కూటమి గెలుచుకుంటే మరింత దూకుడు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దాంతో బీజేపీ వీర హిందూత్వ కార్డుతో ఈ ఎన్నికలలో తలపడనుందని అంటున్నారు. దానికి తగిన ప్రాతిపదికను కూడా సిద్ధం చేసేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం హేమంత్ బిశ్వ శర్మ తమ రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలతో పాటు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి వంటి వారు కూడా కొత్త బాట పట్టాలని బీజేపీ పెద్దలకు సలహా ఇస్తున్నారు.

మరోవైపు చూస్తే పశ్చిమ బెంగాల్ వంటి చోట ముస్లిం ఓటు బ్యాంక్ ని పూర్తిగా ఏకీకృతం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ విజయాలను అందుకుంటోంది. దానిని బ్రేక్ చేయాలంటే హిందూత్వ నినాదమే శరణ్యం అని అక్కడి నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే తన పార్టీ నవ నిర్మాణ్ సేనతో మొత్తం సీట్లకు పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయనతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేనను శరద్ పవార్ ఎన్సీపీని కాంగ్రెస్ ని ఢీ కొట్టాలంటే హిందూత్వ కార్డు మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు.

అయితే ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మిత్రులతో నడుస్తోంది. బీజేపీ కరడు కట్టిన హిందూత్వ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్తే దానికి మిత్రులు ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది కూడా చర్చ గా ఉంది. ఏది ఏమైనా బీజేపీకి ఈ ఎన్నికలు రాజకీయంగా కీలకం కాబట్టి కొత్త స్టెప్ వేయాలనే అనుకుంటోంది అంటున్నారు. పరాజయాల నుంచి విజయాల బాట పట్టేందుకు అది అనివార్యమని కూడా భావిస్తోంది.