బీజేపీనే చెత్త నెత్తినేసుకుంటోందా ?
కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసుకుని కేంద్రమంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటం లేదు.
By: Tupaki Desk | 9 Nov 2023 5:30 PM GMTకల్వకుంట్ల కవితను టార్గెట్ చేసుకుని కేంద్రమంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటం లేదు. తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి వచ్చిన కేంద్రమంత్రులందరు కవిత తొందరలోనే అరెస్టవుతుందని పదేపదే చెబుతున్నారు. తప్పుచేసిన వాళ్ళని చట్టం ఎంతటివారైనా వదిలిపెట్టదని ధర్మపన్నాలు వినిపిస్తున్నారు. అసలు వీళ్ళని కవిత అంశాన్ని ప్రస్తావించమని ఎవరు చెబుతున్నారో అర్ధంకావటం లేదు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కవిత అంశం కూడా ఒక కారణమన్న విషయం అర్ధం కావటం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలక పాత్రని ఈడీ ఎప్పుడో తేల్చిచెప్పేసింది. స్కామ్ లో కవిత పాత్రగురించి ఈడీ కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లలోను, రిమాండు రిపోర్టుల్లో కూడా చాలాసార్లే ప్రస్తావించింది. కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే కారణంతో చాలామందిని అరెస్టు జైలుకు పంపించిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదు ? అన్నది కీలకమైన ప్రశ్న. దీనికి జవాబుగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరగటమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు
కాంగ్రెస్ ఆరోపణలను జనాలు కూడా నమ్మారు. లేకపోతే స్కామ్ లో సంబంధముందని ఇంతమందిని అరెస్టుచేసిన ఈడీ కీలక సూత్రదారైన కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతుకుముందు నరేంద్రమోడీని కేసీయార్ విపరీతంగా టార్గెట్ చేశారు. స్కామ్ లో కవితను ఈడీ విచారణ చేసిన దగ్గర నుండి మోడీ గురించి కేసీయార్ మాట్లాడటం మానేశారు. అసలు కేంద్రం గురించే కేసీయార్ మాట్లాడటంలేదు.
ఇవన్నీ జనాలు గమనిస్తునే ఉన్నారు. దానికితోడు కాంగ్రెస్ ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని జనాలు నిర్ధారణకొచ్చేశారు. ఇదే సమయంలో బండి సంజయ్ ను అధ్యక్షుడిగా పార్టీ తీసేసింది. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో తెలంగాణాలో ఊపు పెరిగింది. ఇదంతా తెలిసి కూడా కేంద్రమంత్రులు ఇంకా కవిత అరెస్టు ఖాయమని పదేపదే ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు. కవిత అంశమే బీజేపీకి పెద్ద మైనస్ అని అర్ధమైనపుడు ఇక దానిగురించి మాట్లాడకూడదు. అయినా పదేపదే మాట్లాడుతున్నారంటే చెత్త నెత్తినేసుకివటం తప్ప మరేమీకాదు.