Begin typing your search above and press return to search.

బీజేపీ కొత్త ట్విస్ట్‌.. టీడీపీ, జనసేన సీట్లు మళ్లీ మొదటికి!

టీడీపీ, జనసేన పోటీ చేయాలనుకుంటున్న కొన్ని సీట్లను బీజేపీ ఆశిస్తోందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 March 2024 6:38 AM GMT
బీజేపీ కొత్త ట్విస్ట్‌.. టీడీపీ, జనసేన సీట్లు మళ్లీ మొదటికి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి 6 పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తోంది. మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లకు టీడీపీ పోటీ పడుతోంది.

అయితే ఇప్పటివరకు మూడు పార్టీల పార్లమెంటు అభ్యర్థులు ఖరారు కాలేదు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాము పోటీ చేసే రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడకు తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ ను అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం బీజేపీ వైఖరేనని అంటున్నారు.

టీడీపీ, జనసేన పోటీ చేయాలనుకుంటున్న కొన్ని సీట్లను బీజేపీ ఆశిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ భావించగా బీజేపీ మాత్రం అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని, విజయనగరంకు బదులుగా అమలాపురం పార్లమెంటు సీటును ఆశిస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది.

అలాగే బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు కేటాయించగా ఇప్పటికే టీడీపీ, జనసేన ప్రకటించిన సీట్లను ఆ పార్టీ ఆశిస్తోందని అంటున్నారు. అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు పశ్చిమ, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను బీజేపీ కోరుతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సీట్లకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సీట్లను తమకు వదిలేయాలని బీజేపీ కోరుతోందని సమాచారం.

ఈ నేపథ్యంలో సీట్ల మార్పు అనివార్యమంటున్నారు. జనసేన పార్టీ సైతం కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. వీటిలోనూ ఇప్పటివరకు కేవలం ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్లలో కొన్నింటిని కూడా బీజేపీ కోరుతోందని సమాచారం.

ఇప్పటికే బీజేపీకి కేటాయించిన ఆరు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తదితర నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించారని తెలుస్తోంది.

బీజేపీ ఇంకా పోటీ చేసే స్థానాల పేర్లను ప్రకటించకపోవడంతో టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా కూడా ఆలస్యమవుతోందని అంటున్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాల పేర్లు ఖరారయితే జనసేన, టీడీపీ తాము పోటీ చేసే సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే బీజేపీ ఇప్పటివరకు తేల్చకపోవడంతో ఆలస్యం అనివార్యంగా మారిందని అంటున్నారు.