Begin typing your search above and press return to search.

బీజేపీ.. క‌ర్ర విడిచి రాజ‌కీయం...!

క‌ర్ర విడిచి సాము చేసిన‌ట్టుగానే కీల‌క విష‌యాన్ని విస్మ‌రించి రాజ‌కీయం చేయ‌డం బీజేపీకే చెల్లింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   16 Aug 2024 2:45 AM GMT
బీజేపీ.. క‌ర్ర విడిచి రాజ‌కీయం...!
X

క‌ర్ర విడిచి సాము చేసిన‌ట్టుగానే కీల‌క విష‌యాన్ని విస్మ‌రించి రాజ‌కీయం చేయ‌డం బీజేపీకే చెల్లింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో పార్టీని అనుక‌రించ‌డ‌మో.. అనుస‌రించ‌డ‌మో చేస్తూ.. బీజేపీ కాలం గ‌డిపేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. వీటికి కార‌ణం.. వార‌ధి పేరుతో గురువారం(ఆగ‌స్టు 15) నుంచి ఆ పార్టీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డ‌మే. నిజానికి ఇప్ప‌టికే రెండు కీల‌క పార్టీలు, టీడీపీ, జ‌న‌సేన‌లు ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నాయి.

కానీ, త‌గుదునమ్మా.. అంటు ఇప్పుడు బీజేపీ కూడా రెడీ అయింది. కానీ, ఇక్క‌డ బీజేపీ నేత‌లు స్వీక‌రించే ఫిర్యాదుల‌ను వారు నేరుగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌రు. వీటిని మ‌ళ్లీ చంద్ర‌బాబు పేషీకి పంపిస్తారు. దీనివ‌ల్ల వారికి ఒరిగేది ఏంటంటే.. త‌మ పార్టీ వారికి కొంత స్వాంత‌న మాత్ర‌మే. ఎందుకంటే.. బీజేపీ నాయ‌కులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు టీడీపీ కార్యాల‌యానికో.. జ‌న‌సేన కార్యాల‌యానికో వెళ్ల‌లేని ప‌రిస్థితి. దీంతో బీజేపీ నేరుగా రంగంలోకి దిగి.. స‌మ‌స్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

కానీ, విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నం, పార్టీ ప్ర‌యోజ‌నం వంటివాటిని తీసుకుంటే.. ఇక్క‌డ బీజేపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు. ఎందుకంటే.. ఎన్ని స‌మ‌స్య‌లు తీసుకున్నా.. తిరిగి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కో.. టీడీపీ మంత్రుల ద‌గ్గ‌ర‌కో.. లేక‌పోతే.. జ‌న‌సేన మంత్రుల వ‌ద్ద‌కో వెళ్లాలి. ఇక‌, బీజేపీ చేసిందేముంది? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుంది. అలా కాకుండా.. కేంద్రం నుంచి రావాల్సిన అంశాల‌పై దృష్టి పెడితే.. కొంత మేర‌కు బీజేపీ ఇమేజ్ పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, అలా చేయ‌డం లేదు.

ఇక‌, బీజేపీ స్థానికంగా పెద్ద‌గా బ‌లంగా లేదు. కూట‌మి పార్టీల ప్ర‌భావంతో తుఫానుతో కొట్టుకు వ‌చ్చి విజ యం ద‌క్కించుకున్న స్థానాలే ఉన్నాయి. వాటిలోనూ మెజారిటీ టీడీపీ నాయ‌కులే ఉన్నారు. దీంతో బీజేపీ నేత‌లు గెలిచిన స్థానాల్లో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా.. ఇప్పుడు ఆ పార్టీ కార్యాల‌యానికి వెళ్లే సాహ‌సం అయితే చేయ‌రు. కాబ‌ట్టి.. ఎలా చూసుకున్న వార‌ధి ఒక టైం పాస్ కార్య‌క్ర‌మ‌మే త‌ప్ప‌.. నిజానికి బీజేపీకి బూస్ట్ ఇచ్చే కార్య‌క్ర‌మం అయితే కాదు. కాబ‌ట్టి.. వాస్త‌వాలు తెలుసుకుని పార్టీ అడుగులు వేస్తే.. ప్ర‌యోజ‌నం.