టార్గెట్ 'డిసెంబరు-3': బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్
డిసెంబరు 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగురు తుందని తాజాగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 10 Oct 2023 6:58 PM GMT'టార్గెట్ డిసెంబరు-3' -ఇప్పుడు బీజేపీ, తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎన్నికల నగారా మోగడం, రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కిన దరిమిలా.. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న డిసెంబరు 3వ తేదీపై ఇటు బీజేపీ, అటు బీఆర్ ఎస్ పార్టీల ముఖ్య నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. డిసెంబరు 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగురు తుందని తాజాగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా బీఆర్ ఎస్ ముఖ్య నాయకురాలు, సీఎం కేసీఆర్ తనయ కవిత కూడా షాకింగ్ డైలాగులు పేల్చారు.
డిసెంబరు 3న మరోసారి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కారు పరుగులు పెడుతుందని, హ్యాట్రిక్ సాధించి ముచ్చటగా సీఎం కేసీఆర్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని కవిత వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. టార్గెట్ డిసెంబరు-3 ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇదిలావుంటే, తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి.. బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. నిన్న నోటిఫికేషన్.. ఈ రోజు పర్యటనలు-ప్రచారాలు అన్నట్టుగా షా దూకుడు ప్రదర్శించారు.
అయితే, తన ప్రసంగంలో పూర్తిగా అమిత్ షా.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ వల్లే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమైందని చెప్పారు. అయితే, దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ కవిత.. గతంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఉంటే తాము ఎందుకు అడ్డుపడేవారమని నిలదీశారు.
అంతేకాదు.. గిరిజనులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గిరిజన యూనివర్సిటీని ప్రకటించారని.. ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో గిరిజనులు ఉన్నారనే విషయం గుర్తుకు వచ్చిందా? అని కవిత ప్రశ్నించారు.
ఇక, కృష్ణా ట్రైబ్యునల్‌లో మార్పులు చేయడం ద్వారా ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అమిత్‌షా చెప్పుకొ చ్చారు. దీనిపైనా కవిత విమర్శలు గుప్పించారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో మార్పులు చేయడం ద్వారా తెలంగాణ గొంతు కోస్తున్నారనే విషయం తెలంగాణ సమాజం గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. టార్గెట్ డిసెంబరు 3పై బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయనే చెప్పాలి. కేంద్రం ఇంకా తీసుకురాని మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమిత్ షా ప్రధానంగా ఫోకస్ చేయడం గమనార్హం.