బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ... మేనిఫెస్టోల తేడా ఇదీ.. !
ఈ రెండు పార్టీల ఉద్దేశం కూడా.. అదికారంలోకి రావడమే. ఈ క్రమంలోనే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సాధారణంగా పార్టీలు చేసే ప్రయత్నాలే ఇవి కూడా చేశాయి.
By: Tupaki Desk | 14 April 2024 6:02 AM GMTసార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్న నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిం చాయి. ప్రస్తుత ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్‌తో మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. ఈ రెండు పార్టీల ఉద్దేశం కూడా.. అదికారంలోకి రావడమే. ఈ క్రమంలోనే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సాధారణంగా పార్టీలు చేసే ప్రయత్నాలే ఇవి కూడా చేశాయి.
బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి ఎన్డీయే కూటమిగా ముందుకు సాగుతోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇదేవిధంగా ప్రాంతీయ పార్టీలో పొత్తులు పెట్టుకుని 'ఇండి' కూటమిగా రంగంలొకి దిగింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏమేరకు ప్రజలను ఆకర్షిస్తాయనేది చర్చగా మారిం ది. బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. ఉచితాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అసలు మొత్తం మేనిఫెస్టోలో ఎక్కడా.. రూపాయి మేం ఇస్తాం.. అని కూడా ప్రకటించలేదు. కేవలం రాయితీలు, సబ్సిడీలకే పరిమితమైంది.
కీలకమైన పథకాలను మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. స్వయంసమృద్ది, వ్యక్తిగత ఆదాయం పెంచుకునే మార్గాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ పెద్దపీట వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఎక్కడా పోటీ పడలేదు. తమ దారి తమదే అన్నట్టుగా బీజేపీ వ్యవహరించింది. దేశాన్ని రాబోయే ఐదేళ్లలో మరింత అభివృద్ధి దిశగా నడిపించే వ్యూహంతోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ది ఆకాంక్షలు ఉన్న వారికి ఈ మేనిఫెస్టో.. బాగానే ఉందనే అభిప్రాయం కలుగుతుంది.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఉచితాలకు.. పెద్దపీట వేసింది. పేద కుటుంబాలకు ఏడాది రూ.లక్ష నేరుగా వారి ఖాతాల్లో వేస్తామన్నది ప్రధాన హామీ. ఇక, కుల గణనకు ప్రాధాన్యం ఇచ్చింది. న్యాయ పత్ర పేరుతో విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మధ్యతరగతి, పేదలను ఆకట్టుకునే ప్రతయ్నం చేసింది. గత పదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. ఇంధనం ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. సైనిక నియామకాల విషయంలోమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెరుపులు
మహాలక్ష్మీ పథకం ద్వారా ఏడాదికి లక్ష రూపాయలు..
మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
కొసమెరుపు..
ఇలాంటి ఉచిత హామీలు.. వర్గాలను ఆకట్టుకునే హామీలను బీజేపీ ఇవ్వలేదు. మరి ప్రజలు ఎటు వైపు నిలుస్తారన్నది చూడాలి.