బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి : అగ్గి రాజేస్తున్న కులగణన ఇష్యూ !
ఇక దీని మీద నరేంద్ర మోడీ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఇండియా కూటమి మీద బాణాలు వేశారు.
By: Tupaki Desk | 2 Oct 2023 5:45 PM GMTకుల గణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ చరిత్రకు ఎక్కింది. ఈ దేశంలో 143 కోట్ల మంది పౌరులు ఉన్నారు. అయితే ఫలనా జనాభా అధికం అని అనుకోవడమే తప్ప కచ్చితమైన లెక్కలు అయితే లేవు. కానీ ఫస్ట్ టైం బీహార్ లో ఓబీసీలు 67 శాతం పైగా ఉన్నారంటూ కుల గణన చేసి మరీ అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం లెక్క తేల్చింది.
దీనికి రాహుల్ గాంధీ సమర్ధిస్తూ నేరుగా ప్రధాని మోడీని బీజేపీని టార్గెట్ చేశారు. ప్రధాని వద్ద 90 మంది కార్యదర్శులు ఉంటే ఓబీసీలు జస్ట్ ముగ్గురే ఉన్నారు, ఇదేనా అభివృద్ధి సమానత్వం అంటూ నిందించారు. ఈ దేశంలో ఎందుకు కుల గణన చేయలేకపోయారు అని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా కుల గణన చేస్తామని ఆయన ప్రకటించారు.
ఇక దీని మీద నరేంద్ర మోడీ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఇండియా కూటమి మీద బాణాలు వేశారు. కులగణన అంటే ప్రజల మధ్య దారుణమైన విభజన మాత్రమే అన్నారు. ఇది మహా పాపం నేరం అని కూడా అన్నారు.
విపక్షాలు ఇంతకు తెగిస్తాయా ప్రజల మధ్య విభజన తెస్తాయా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మోడీ ఏ పార్టీ పేరుని కానీ నాయకుడి పేరుని కానీ అసలు ప్రస్తావించలేదు. కానీ కుల గణనను ఆయన పూర్తిగా తప్పు పట్టారు.
కులం పేరుతో గణన అంటే ప్రజల సున్నితమైన భావోద్వేగాలతో ఆడుకోవడమే అని మండిపడ్డారు. అసలు కులాల వారీగా విభజన చేసే ఎటువంటి ప్రయత్నం అయినా కూడా మహా పాపం అని ఆయన నిర్ధారించేశారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడ్డాయని, ఇపుడు వారు ప్రతిపక్షంలో ఉంటే పేదలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే కుల గణన అన్నది ఇపుడు విపక్షాలకు ఆయుధంగా మారుతోందా అన్న చర్చకు తెర లేస్తోంది. దేశంలో కులం మతం ఎపుడూ సున్నితమైన అంశాలే. 1990 ప్రాంతంలో జనతాదళ్ మండల్ కమిషన్ పేరుతో సున్నితమైన అంశాలను తెర ముందుకు తెచ్చి రాజకీయంగా బీజేపీని సవాల్ చేసింది.
దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ మందిర్ ఇష్యూని తెచ్చిందన్నది చరిత్రలో ఉంది. అంటే కులాన్ని మూసేసేది మతం కార్డు . అలా నాడు నరుక్కు వచ్చిన బీజేపీకి గడచిన మూడు దశాబ్దాల దేశ రాజకీయాల్లో సిద్ధాంతాల పరంగా ఎదురులేకుండా పోయింది. రాజకీయంగానే ఆ పార్టీ ఢీ కొంటూ వచ్చింది. అయితే ఇపుడు చూస్తే కుల గణన పేరుతో బీజేపీని ఇండియా కూటమి పెను సవాల్ విసురుతోంది.
దీని వల్ల బీజేపీని ఉత్తరాదిన దెబ్బతీయడానికి సరైన ఆయుధాన్ని సమకూర్చుంటోంది అని అంటున్నారు. ఉత్తరాదిలో కులం మతం సున్నితమైన అంశాలుగానే ఉంటాయి. బీజేపీ చేతిలో ఆరు నెలలకు పైగా సమయం ఉంది. కుల గణన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.
మరి దీని మీద బీజేపీ అనుసరించే విధానం ఏంటి అన్నదే చర్చగా ఉంది. ప్రధాని మోడీ కుల గణన మహా పాపం అంటున్న నేపధ్యం చూస్తే కనుక ఈ ఇష్యూ రేపటి ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి మధ్యన భీకర పోరుకు తావు ఇచ్చేలా కనిపిస్తోంది అని అంటున్నారు.