బీజేపీకి అవ్వా బువ్వా రెండూ కావాలట ?
అవ్వా బువ్వా అంటే వైసీపీ టీడీపీ రెండు పార్టీల మద్దతూ బీజేపీకి కావాలని అంటున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 May 2024 2:50 PM GMTఅవ్వా బువ్వాలలో ఏదో ఒకటి అంటే గడసరి ఒకరు రెండూ కావాలని అన్నారని సామెత. ఇపుడు సరిగ్గా ఏపీ రాజకీయాల మీద కేంద్రంలోని బీజేపీ వైఖరి కూడా అలాగే ఉంది అని అంటున్నారు. అవ్వా బువ్వా అంటే వైసీపీ టీడీపీ రెండు పార్టీల మద్దతూ బీజేపీకి కావాలని అంటున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో మొత్తం ఉన్న సీట్లు పాతిక. సౌత్ లో చూస్తే ఉన్న అయిదు రాష్ట్రాలలో మూడు పెద్ద స్టేట్స్ లో ఏపీ ఒకటి. అన్నింటికన్నా తక్కువగా తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు ఉంటే ఆ తరువాత కేరళలో ఇరవై ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక పెద్ద స్టేట్స్ లో ఏపీకి పాతిక, కర్నాటకకు 28, తమిళనాడుకు ముప్పయి తొమ్మిది ఉన్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో కలుపుకుని నలభై అని కూడా చెప్పవచ్చు.
టోటల్ గా 130 ఎంపీ సీట్లు సౌత్ స్టేట్స్ లో ఉంటే బీజేపీకి కర్నాటక తెలంగాణాల మీదనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. ఆ రెండూ కలుపుకున్న పాతిక ఎంపీ సీట్ల దాకా ఈసారి బీజేపీకి మించవని అంటున్నారు. మరి మరో పాతిక ఎంపీ సీట్లు సౌత్ నుంచి పట్టుకుని వెళ్తేనే కేంద్రంలో మూడవసారి బీజేపీ అధికార పీఠానికి చేరువ అవుతుంది అన్నది తాజాగా వస్తున్న అంచనాలు అంటే అలా చూస్తే పాతిక ఎంపీ సీట్లు గంపగుత్తగా ఏపీలో ఉన్నాయి.
రేపటి రోజున ఏపీలో టీడీపీ కూటమి గెలిచినా ఏ పదిహేను నుంచి పదిహేడు ఎంపీ సీట్లు దక్కినా మిగిలిన ఎనిమిది నుంచి పది సీట్లు వైసీపీకి కూడా వస్తాయని అంటున్నారు. బీజేపీ పెద్దల వద్ద ఉన్న అంచనాలు అయితే డబుల్ డిజిట్ కి తక్కువ కాకుండా వైసీపీకి ఎంపీలు వస్తారని అంటున్నారు.
దాంతో వైసీపీని కూడా తన వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అన్న ప్రచారం మొదలైంది. అలా ఎందుకు బీజేపీ వైసీపీల మధ్య తెర చాటు బంధం ఉంది కదా అంటే అది మార్చి వరకూ మాటే అని అంటున్నారు. ఎపుడైతే టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడిందో వైసీపీ దూరం పాటిస్తోంది అని అంటున్నారు.
పైగా వైసీపీ అధినాయకత్వం తమకు ఏపీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రంలో ఇండియా కూటమి ఎన్డీయే కూటమిలో ఎవరు ఏపీకి మేలు చేస్తారో వారికే మద్దతు అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. దాంతో కమల దళంలో కంగారు మొదలైంది అని అంటున్నారు.
రేపటి రోజున సరిసమానంగా ఎన్డీయేకు ఇండియా కూటమికి సీట్లు వచ్చి మ్యాజిక్ ఫిగర్ కి రెండు పార్టీలూ ఆమడ దూరంలో ఉంటే ఏపీలో వైసీపీ ఎంపీలు అత్యంత కీలకం అవుతారు అని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఆలోచనలు కూడా మారవచ్చు అని అంటున్నారు.
ఏపీలో బీజేపీ మద్దతు చూసుకుని ఎన్నికల వేళ టీడీపీ వ్యవస్థలను మ్యానేజ్ చేసి కొన్ని జిల్లాలలో వైసీపీ అవకాశాలను దెబ్బకొట్టింది అన్న ఆగ్రహం అయితే వైసీపీకి ఉంది అని అంటున్నారు. దాంతో వైసీపీ అనూహ్య నిర్ణయం వైపు జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దాంతోనే ఇపుడు బీజేపీ పెద్దలు ఏపీలో పాతిక ఎంపీ సీట్లూ తమ వైపు ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు అని అంటున్నారు.
బీజేపీకి ఎన్ని రకాలైన లెక్కలు వేసుకున్న 230 దాకా సీట్లు రావచ్చు అని అంటున్నారు. 273 మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి మిత్రుల సాయం తప్పనిసరి అని అంటున్నారు. దాంతోనే ఇపుడు వైసీపీ టీడీపీ రెండు పార్టీలను కూడా తన వెంట ఉంచుకోవడానికి బీజేపీ చూస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఏపీలో బద్ధ ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ టీడీపీ ఒకే గూటిలోకి చేరేందుకు అంగీకరిస్తారా అన్నదే కీలకమైన చర్చగా ఉందిట.