Begin typing your search above and press return to search.

బీజేపీలో ఆధిపత్య వైఖరి ముసలం ముదిరి పాకానపడిందా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతుంది.

By:  Tupaki Desk   |   31 May 2024 5:48 AM GMT
బీజేపీలో ఆధిపత్య వైఖరి ముసలం ముదిరి  పాకానపడిందా?
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 1న జరగబోయే ఏడో విడత పోలింగ్ తో ఎన్నికలు ముగియనున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈసారి కూడా అధికారం తమదే అని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. అయితే... అదంతా మోడీ క్రెడిట్ మాత్రమే అని.. ఆరెస్సెస్స్ పాత్ర అత్యల్పం అన్నట్లుగా బీజేపీలోని ఒక వర్గం నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఇప్పటికే ఆరెస్సెస్ అనేది ఆధ్యాత్మిక సంస్థ.. బీజేపీ అనేది రాజకీయ సంస్థ.. ఇక్కడ రాజకీయంగా బీజేపీ సాధించే విజయాలన్నీ మోడీ - షా ధ్వయం ఫలితమే అనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందని... ఎన్నికల ఫలితాల అనంతరం ఇది బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టైపులో కథనాలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి!

అవును... భారతీయ జనతాపార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందని.. ఎన్నికల అనంతరం అది బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారం ప్రధానంగా... మోడీ - షా వర్సెస్ నితిన్ గడ్కరీ గా సాగుతుందని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగానే నాగపూర్ లో గడ్కరీని ఓడించడానికి మోడీ, షాలు ప్రయత్నించారని.. ఆయనకు అనుకూల వర్గంగా ఉన్న 1.5 లక్షల ఓట్లను జాబితాలో మాయం చేశారనే ఆరోపణలూ తెరపైకి వస్తున్నాయి.

దీనికి తోడు ఎన్నికల సమయంలో నితిన్ గడ్కరీకి మద్దతుగా అటు మోడీ కానీ, ఇటు అమిత్ షా కానీ ఎలాంటి ప్రచారం చేయలేదు సరికదా... బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుండి గడ్కరీ పేరును తీసి పక్కనపెట్టిన పరిస్థితి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. నెక్స్ట్ స్టెప్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారంట గడ్కరీ!

పైగా... బీజేపీకి ఆరెస్సెస్ అవసరం లేదని నడ్డా, అమిత్ షా వ్యాఖ్యానించారనే చర్చ రచ్చ రచ్చగా మారిన పరిస్థితి. నితిన్ గడ్కరీ ఆరెస్సెస్స్ కి దగ్గర మనిషి కాబట్టే ఈ తరహా కామెంట్లు చేశారని కూడా అంటున్నారు. దీంతో... పరిస్థితి ముదిరి పాకానపడిందని గ్రహించారో ఏమో కానీ... ఈ వ్యవహారంపై ఆరెస్సెస్స్ కీలక నేతలతో గడ్కరీ సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

అయితే... గడ్కరీ కూడా ఎక్కడా తగ్గడం లేదు! ఇందులో భాగంగా బీజేపీలో మోడీ - షాల ఆధిపత్య వైఖరిని అవకాశం వచ్చినప్పుడల్లా ఎండగడుతూ వస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే 2022లో పాలనలో లోపాల మీద సొంత సర్కారుపైనే గడ్కరీ విరుచుకుపడటంతోపాటు... వాజ్‌ పేయీ, అద్వానీ, దీన్‌ దయాళ్‌ ల కృషి వల్లే నేడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.

ఈ స్థాయిలో పరిస్థితులు మారిపోయాయని.. భారతీయ జనతాపార్టీలో ఆధిపత్య వైఖరి ముదిరి పాకానపడిందని.. మరి ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు.