పవన్ కోసం గంపెడాశలతో బీజేపీ!
పవన్ కళ్యాణ్ విదేశాల నుంచి రాగానే సీట్ల సర్దుబాటు చేసుకుని ఆయన తో తెలంగాణాలో వారాహిని తిప్పించాలని ఉబలాట పడుతోంది.
By: Tupaki Desk | 3 Nov 2023 3:49 AM GMTతెలంగాణా బీజేపీ ఇపుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం గంపెడాశలతో ఎదురుచూస్తోంది. పవన్ కళ్యాణ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినీ నటుడు. యూత్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో. ఇక ఆయనకు చెందిన బలమైన సామాజికవర్గం తెలంగాణాలోనూ ఉంది. దాంతో పవన్ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది.
ఇక పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది ఇపుడు చర్చకు వస్తున్న విషయం. అయితే పది నుంచి పన్నెండు సీట్ల దాకా బీజేపీ ఇస్తుంది అని అంటున్నారు. అవి కూడా హైదరాబాద్ ఖమ్మం జిల్లాలలో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉండే చోట ఈ సీట్లను కేటాయిస్తుంది అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించాలని నిర్వహిస్తారని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి జాతీయ నేతలు ఎంతమంది వచ్చినా లోకల్ గా ఉండే నేతలు ప్రచారానికి సరిపోరు. పైగా గ్లామర్ పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ వస్తే పైసా ఖర్చు లేకుండా వేలాది జనం కూడా వస్తారు.
సభలు సూపర్ హిట్ అవుతాయి. అపుడు బీజేపీకి ఎంతో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్నది కమలనాధుల భావనగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ సీట్లు తెచ్చుకోవాలని భావిస్తోంది. బీజేపీ టార్గెట్ కూడా అదే. ఆ విషయాన్ని ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ తెలియచేశారు.
తెలంగాణాలో హంగ్ రావాలన్నది బీజేపీ పక్కా ప్లాన్ అని కూడా అంటున్నారు. బీజేపీ ఎంత ఎదిగితే ఎంతలా ఓట్ల షేర్ పెంచుకుంటే అంతలా ప్రధాన పార్టీల ఓట్లకు చిల్లు పడుతుంది. అపుడు త్రిముఖ పోరులో హంగ్ అసెంబ్లీ రావచ్చు. ఆ కీలక అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి బీజేపీ డబుల్ డిజిట్ నంబర్ ఉపయోగపడుతుంది అని ఆశిస్తోంది.
అందుకే క్రౌడ్ పుల్లర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపాలని భావిస్తోంది. పవన్ కళ్యాణ్ విదేశాల నుంచి రాగానే సీట్ల సర్దుబాటు చేసుకుని ఆయన తో తెలంగాణాలో వారాహిని తిప్పించాలని ఉబలాట పడుతోంది. అయితే పవన్ ఏపీ సభలు చాలా హీటెక్కించేలా ఉంటాయి. ఆయన అధికార పార్టీ వైసీపీని చీల్చిచెండాడుతారు.
అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నేరుగా మాటలతో దాడి చేస్తారు. అలాగే తెలంగాణాలో చేస్తేనే వారాహి సభలు హిట్ అవుతాయి. పవన్ తో పొత్తుల వల్ల బీజేపీకి కూడా లాభం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ పవన్ కి ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వడం ద్వారా బీయారెస్ తో పాటు కాంగ్రెస్ మీద ఒకేసారి దూకుడు చేయాలని చూస్తోంది. మరి పవన్ బీజేపీతో పొత్తులు కుదుర్చుకుని పోటీకి దిగుతారా. ఎన్నికల ప్రచారంలో గట్టిగా పాల్గొంటారా అంటే ఆయన విదేశాల నుంచి వచ్చాకనే మిగిలినవి చూడాలని అంటున్నారు.