Begin typing your search above and press return to search.

ప్రముఖుల భద్రత నుంచి బ్లాక్ క్యాట్స్ బయటకు

దేశంలో వీవీఐపీలు.. ప్రముఖుల వ్యక్తిగత భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బ్లాక్ క్యాట్స్ కు సంబంధించి కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:24 AM GMT
ప్రముఖుల భద్రత నుంచి బ్లాక్ క్యాట్స్ బయటకు
X

దేశంలో వీవీఐపీలు.. ప్రముఖుల వ్యక్తిగత భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బ్లాక్ క్యాట్స్ కు సంబంధించి కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు ప్రముఖులైన వారి సేవలో తరించే వారు ఇకపై ఆ విధులకు దూరం కానున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త కసరత్తును చేపడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా వీఐపీలకు భద్రతగా వ్యవహరిస్తున్న ఎన్ ఎస్ జీ కమెండోలతో పాటు ఐటీబీపీ సిబ్బందినీ ఉపసంహరించుకోనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం తొమ్మిది కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సీఆర్ఫీఎఫ్ కు కానీ సీఐఎస్ఎఫ్ లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. 1984లో ఎన్ఎస్ జీ వ్యవస్థను ఏర్పాటు చేయటం తెలిసిందే.

అప్పట్లో ఉగ్రవాదులను ఏరేయటానికి.. విపత్తుల వేళ సాయం చేసేందుకు వీలుగా వీరిని ఏర్పాటు చేశారు. అయితే.. అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా మారటం తెలిసిందే. ఉగ్రవాదుల ఏరివేత కంటే కూడా.. ప్రముఖులు.. వీవీఐపీలకు వ్యక్తిగత రక్షణలోనే వారు కొనసాగాల్సి వస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

బ్లాక్ క్యాట్ కమెండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని పేర్కొంటూ 2012లోనే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే.. అదిప్పటివరకు ఆచరణలోకి రాలేదు. అత్యంత నైపుణ్యమున్న 450 మంది వరకు బ్లాక్ క్యాట్ కమెండోలు ప్రస్తుతం ప్రముఖుల భద్రతలో ఉన్నారు. వారిని ఆ విధుల నుంచి తప్పించి దేశంలోని సమస్యత్మాక ప్రాంతాల్లో టీంల వారీగా మొహరించాలని భావిస్తున్నారు. మొత్తంగా బ్లాక్ క్యాట్ కమెండోలు ప్రముఖులకు మాత్రమే సేవలు అందిస్తారన్న విమర్శకు కేంద్రంలోని మోడీ సర్కారు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.