Begin typing your search above and press return to search.

3 నెలల వాన ఒక్క రాత్రిలో.. ఎడారైనా మునగాల్సిందే?

ఎడారి అంటే ఎడారే.. కనుచూపు మేరలో నీరే కానరాదు.. దాహమేస్తే నీటి చుక్క కోసం వెదుకులాడుకోవాల్సిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:36 PM GMT
3 నెలల వాన ఒక్క రాత్రిలో.. ఎడారైనా మునగాల్సిందే?
X

ఎడారి అంటే ఎడారే.. కనుచూపు మేరలో నీరే కానరాదు.. దాహమేస్తే నీటి చుక్క కోసం వెదుకులాడుకోవాల్సిందే.. అలాంటి ఎడారిలో చినుకు పడితే అదో ప్రత్యేకం.. వాన కురిస్తే సంతోషం.. కానీ.. ఏకంగా పెద్ద వర్షమే పడితే? అంతకంటే విశేషం ఏముంటుంది..? ఇప్పుడిలాంటి సందర్భమే అమెరికాలో జరిగింది. భారత్ లో రాజస్థాన్ థార్ ఎడారి, ఆఫ్రికాలో సహారా ఎడారి ఎలాగో అమెరికాలోని నెవెడా రాష్ట్రంలోని బ్లాక్ రాక్ ఎడారి అలాంటిది. బహుశా.. నల్లటి రాళ్లతో ఉండడం వల్లనేమో దీనికి ఆ పేరు వచ్చింది. నెవెడా వాయువ్య దిక్కున అగ్నిపర్వత-, భూ ఉష్ణ లక్షణాలతో ఉంటుందీ ఎడారి. ఈ ఎడారిలో లేక్ లహోంటన్ సరస్సు ప్రత్యేకం. ఉప్పు పొద వృక్షసంపద, విస్తృతంగా, చెల్లాచెదురుగా ఉండే వేడి నీటి బుగ్గలు ప్లేయాతో చదునుగా ఉంటుంది.

ఆ ఉత్సవం ప్రత్యేకం..

బ్లాక్ రాక్ ఎడారిలో బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. అసలే పర్యటనలు అంటే మోజుపడే.. వారాంతాలను బాగా ఎంజాయ్ చేయాలని తపించే అమెరికన్లకు ఇదో టూరిస్ట్ స్పాట్. ఇలానే కొందరు గత వారంతంలో బ్లాక్ రాక్ ఎడారికి వచ్చారు. ఎడారి కదా..? వర్షం కురవదని అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాన ముంచెత్తింది. ఆ దెబ్బకు ఎడారి బురద మయంగా మారిపోయింది.

70 వేల మంది చిక్కుకున్నారట..?

అమెరికన్లు ఎంతటి పర్యటక ప్రియులో అందరికీ తెలిసిందే. దీనికి మరో ఉదాహరణ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ కు హాజరైన వారి సంఖ్యనే. ఎడారిలో జరిగే ఫెస్టివల్ అయినప్పటికీ.. దీనికి ఏకంగా 70 వేల మందిపైగా హాజరయ్యారట. వీరంతా అకాల వర్షంతో బురదలో చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం ఎటు చూసినా బురదే. అసలే ఎడారి.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉండని అమెరికా. అందరూ కార్లే వాడే అగ్రరాజ్యం. ఇక ఈ నేపథ్యంలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ కు వచ్చినవారి వాహనాలు బురదతో ముందుకు కదల్లేకపోయాయి. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి.

అక్కడే ఆగిపోవాల్సిందే..

పరిస్థితుల నేపథ్యంలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వాహకులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రభావం తగ్గి.. భూమి ఉపరితలం ఎండి పోయే వరకు ఎవరినీ బయటకు అనుమతించకూడదని నిర్ణయించారు. వారి వాహనాలను ముందుకు అనుమతించమని తెలిపారు. సందర్శకులు వారి వద్ద ఉన్న ఆహారం, నీరు వాడుకొని.. పొడిగా వెచ్చటి ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం ది బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధీనంలో ఉంది.

హిల్లరీ హరికేన్ దెబ్బ ఇది..

దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాలు ఇటీవల వరదలు, కార్చిచ్చు బారినపడిన సంగతి తెలిసిందే. కెనడాలో రెండు నెలలుగా కార్చిచ్చు ప్రభావం నెలకొంది. దాని ప్రభావం వాషింగ్టన్ వరకు వ్యాపించింది. ఇక హిల్లరీ తుఫాను మెక్సికోను వణికించింది. వాస్తవానికి ఆగస్టు 27న బర్నింగ్‌మ్యాన్‌ ఫెస్టివల్‌ మొదలైంది. అదే సమయంలో హిల్లరీ హరికేన్‌ తాకింది. రాత్రంతా ఎడతెరపి లేని వాన పడింది. మొత్తం బురదగా మారిపోయింది. ఈ వాన ఎంత భారీ అంటే.. 3 నెలల్లో పడాల్సిన వర్షం ఒక్క రాత్రే కురిసింది. అప్పటికీ చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఎవరూ ఇక్కడికి రావడానికి లేదా.. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్‌ సిటీని మూసివేశారు. కాగా, కొందరు మాత్రం కాలి నడక బురదను దాటుకుంటూ ఎడారి నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు.