ఢిల్లీలో పేలుడు శబ్దం.. ఉలిక్కిపడిన దేశ రాజధాని
దేశ రాజధానిలో చోటు చేసుకున్న పేలుడు శబ్దం కలకలాన్ని రేపింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన నిఘా వర్గాలు.
By: Tupaki Desk | 27 Dec 2023 4:21 AM GMTదేశ రాజధానిలో చోటు చేసుకున్న పేలుడు శబ్దం కలకలాన్ని రేపింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన నిఘా వర్గాలు.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు శబ్దం వినపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది చాణక్యపురి ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
అయితే.. ఈ పేలుడు శబ్దానికి కారణం ఏమిటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించినా అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎంబసీలోని సిబ్బంది వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలోతమ కార్యాలయానికి దగ్గర్లో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని.. అసలేం జరిగిందో మాత్రం అర్థం కాలేదన్నారు.
పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువుని గుర్తించలేదు. కాకుంటే.. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించి రాసిన ఒక లేఖను మాత్రం గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ లేఖలో ఏముందన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఎలాంటి అదికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రాయబార కార్యాలయం స్పందిస్తూ తమ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎంబసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నట్లుగా ఎంబసీ కార్యాలయం పేర్కొంది. అయితే.. ఈ పేలుడు దేని కారణంగా చోటు చేసుకుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.