బ్లింకిట్... బ్లైండ్ గా నమ్మొద్దంటూ ఆసక్తికర పోస్టు!
జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ పై తాజాగా ఓ యూజర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
By: Tupaki Desk | 14 March 2025 10:01 AM ISTజొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ పై తాజాగా ఓ యూజర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లో 5+1 ఆయిల్ పాకెట్ లో మోసం చేశారంటూ బెంగళూరు వాసి గట్టిగా పోరాడిన విషయం నెట్టింట తీవ్ర సంచలనంగా మారగా... తాజాగా తూకంలో తేడా ఉందంటూ మరో యూజర్ తాజాగా రెడ్డిట్ లో పోస్ట్ పెట్టారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
అవును... గత ఏడాది డిసెంబర్ లో బ్లింకిట్ పై ఓ బెంగళూరు వాసి చిన్న సైజు యుద్ధమే చేశారు. బ్లింకిట్ లో 5లీ + 1లీ ఆయిల్ ఆర్డర్ చేసినట్లు తెలిపాడు. యాప్ లో 5లీ + 1లీ కలిపి రూ.1072 అని ప్రచారం చేశారని.. తీరా ఆర్డర్ చేసిన తర్వాత 5లీ మాత్రమే డెలివరీ చేశారని యూజర్ రెడ్డిట్ లో రాసుకొచ్చారు. దీనికి బ్లింకిట్ స్పందించింది. ఆ స్పందన మరింత వివాదాస్పదమైంది.
ఇందులో భాగంగా... మిగిలిన 1లీ వస్తువుకు రూ.100 కూపన్ మాత్రమే అందించగలమని వెల్లడించింది. దీంతో... 1072/6 = రూ.178.. అంటే.. ఒక్కో ఆయిల్ పాకెట్ ధర 178 రూపాయలు అవ్వగా... ఆరో పాకెట్ స్థానంలో రూ.100 కూపన్ మాత్రం ఇస్తామని బ్లింకెట్ చెప్పడం ఏమిటని యూజర్ నిలదీశారు. అంటే.. ఒక్కో కస్టమర్ పై ఆయిల్ పైనే రూ.78 ఎక్కువగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు.
ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తూకంలో తేడా అనే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తాను అరకిలో ద్రాక్ష పళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370 గ్రాములు మాత్రమే బ్లింకిట్ డెలివరీ చేసిందని ఓ యూజర్ రెడ్డిట్ లో ఫిర్యాదు చేశారు. పాకెట్ సైజుపై అనుమానం వచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే.. అప్పుడు కూడా ప్యాకింగ్ తో కలిపి 370 గ్రాములే ఉన్నట్లు తెలిపారు.
దీంతో.. కస్టమర్లను బ్లింకిట్ మోసం చేస్తుందని.. ఇదో పెద్ద స్కామ్ అని.. ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయలు పంపిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ రెడ్డిట్ లో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన యూజర్లలో పలువురు.. తమకూ ఇలానే జరిగిందంటూ వారి వారి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో... బ్లింకిట్ వ్యవహారం మరోసారి వైరల్ గా మారింది.