34 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా!
బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 34 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది.
By: Tupaki Desk | 14 Sep 2023 11:49 AM GMTబీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 34 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ముజఫర్ పూర్ జిల్లాలో బాగమతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రెస్య్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
వివరాళ్లోకి వెళ్తే... బీహార్ రాష్ట్రంలో ముజఫర్ పూర్ జిల్లాలో గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా భాగమతి నదిలో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఒక పడవ ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. భట్గామ మధుర్ పట్టి పీపాల్ ఘాట్ నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నవారు నదిలోపడిన చిన్నారులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చాలా మంది పిల్లలను బయటకు తీసినప్పటికీ చాలా మంది పిల్లలు నది ప్రవాహంలో కొట్టుకుని పోయారని అంటున్నారు.
సీఎం నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో ఈ పెను ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 15 -20 మందిని కాపాడగా.. 10 మంది ఆచూకీ ఇంకా దొరకలేదని తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు యుద్ధప్రాతిపధికన జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో పడవలో 34 మంది విద్యార్థుల వరకూ ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముజఫర్ పూర్ లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఈ రోజు సీఎం నితీష్ కుమార్ వస్తున్నారు. దీంతో... ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని.. రెస్క్యూ టీం కూడా సమయానికి చేరుకోలేదని.. దీంతోనే నదిలో పడిన చిన్నారులు ఎక్కువమంది గల్లంతయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇక మరణించిన పిల్లల తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో విద్యార్థులతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారని తెలుస్తుంది.
ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ తూర్పు సహరియార్ అక్తర్ స్పందించారు. మధుర్ పట్టి ఘాట్ సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలిపారు. పడవలో సామర్థ్యం కంటే ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత రక్షించిన కొంత మంది చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని అన్నారు.