కొత్తా దేవుడండీ.. ఓట్లపై కన్నేశాడండీ!
ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగి.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పలు పనులు చేస్తున్నారు
By: Tupaki Desk | 28 Dec 2023 9:49 AM GMTఏపీలో కొత్త పొలిటికల్ దేవుడు బయలు దేరాడు. ఆయనే బోడే రామచంద్రయాదవ్. భారత చైతన్య యువజన పార్టీ పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. తాజాగా దీనికి సంబంధించి శ్రీకారం కూడా చుట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు.
ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగి.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పలు పనులు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు తనపై దాడులు చేస్తున్నారంటూ.. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి తన ఇబ్బందులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కూడా కల్పించింది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం గమనార్హం.
అయితే.. ఈ పార్టీ స్తానికంగా ఉన్న కొన్ని పార్టీలకు అనుబంధంగా పనిచేస్తోందనే వాదన ఉంది. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే లక్ష్యంగా యాదవ్ పనిచేస్తున్నారని వైసీపీ అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. ముఖ్యంగా బీసీ, యువతరం ఓట్లను చీల్చడం ప్రధాన లక్ష్యంగా రామచంద్రయాదవ్ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణగా ఉంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవ ర్గాల్లోనూ పోటీ చేస్తామని.. బీసీలను తమవైపు మళ్లించుకుంటామని యాదవ్ చెబుతున్నారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని ప్రధాన పార్టీలకే అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో యాదవ్ చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వంగా వైసీపీని ఇబ్బందిపెట్టాలని చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాదవ్ పార్టీ బీసీవైపీ ఏమేరకు పనిచేస్తుందో చూడాలి. ఏదేమైనా.. రాజకీయాల్లో మార్పులు అవసరమే కానీ.. ఇలా ఓ పార్టీకి మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.