Begin typing your search above and press return to search.

ఇదేంది బొజ్జా? వ్యతిరేక వార్తలు రాస్తే తాటతీస్తా!

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పరిధిలోని వికృతిమాల.. మునగలపాళెం తదితర ప్రాంతాల్లోని కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్న వైనంపై కథనం పబ్లిష్ అయ్యింది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:37 AM GMT
ఇదేంది బొజ్జా? వ్యతిరేక వార్తలు రాస్తే తాటతీస్తా!
X

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. తప్పులు ఎత్తి చూపితే చెలరేగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా రెచ్చిపోయిన వైనం శ్రీకాళహస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీరు తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు తప్పులు చేయొద్దని.. ఎవరి మీదా రెచ్చిపోవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. టీడీపీకి చెందిన కొందరి తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాజాగా బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారశైలి రాజకీయ సంచనలంగా మారింది.

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పరిధిలోని వికృతిమాల.. మునగలపాళెం తదితర ప్రాంతాల్లోని కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్న వైనంపై కథనం పబ్లిష్ అయ్యింది. అది కూడా తెలుగుదేశం పార్టీకి స్నేహితుడిగా చెప్పే ఈనాడు దినపత్రికలో. దీనిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల చెలరేగిపోయారు. తన సహాయకుల చేత ఫోన్ చేయించి మరీ.. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా.. ఏమనుకుంటున్నావో.. ఇదే నీకు చివరి హెచ్చరిక అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు.

అక్కడితో కూడా ఆగని ఎమ్మెల్యే.. వైసీపీ పాలనలో కనబడలేదా? ఇప్పుడే అన్ని గుర్తుకు వచ్చాయా? ఒళ్లు దగ్గర పెట్టుకో.. అంటూ చెలరేగిపోయారు. ‘‘ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగోదు. నీ కథ ముగిసినట్లే’’ అంటూ తిట్లదండకం అందుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా సదరు మీడియా సంస్థ వార్త రూపంలోనూ ఇవ్వటం సంచలనంగా మారింది. నిత్యం నీతులు చెప్పే ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ.. లోపాన్ని ఎత్తి చూపిస్తే సరిదిద్దుకోకుండా.. అందుకు భిన్నంగా వార్నింగ్ ఇచ్చిన వైనం సంచలనంగా మారింది.

సీనియర్ నేత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసి.. రెండో దఫా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. పొలిటికల్ కెరీర్ లో ఎదగాల్సింది పోయి.. అనవసర వివాదాల్ని చేజేతులారా ఆహ్వానిస్తూ అడ్డంగా బుక్ అవుతున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వారి కారణంగా ప్రభుత్వానికి.. పార్టీకి జరిగే డ్యామేజ్ పై చంద్రబాబు స్పందించాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చి నిండా మూడు నెలలు కూడా గడవకముందే.. ఎవరైనా విమర్శిస్తే చాలు చెలరేగిపోతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఓవైపు ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ.. ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ట్రాక్టర్ కు రూ.500 చొప్పున వసులు చేస్తున్న వైనంపై విమర్శలు వస్తే.. వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి.. ఉల్టాగా వార్నింగ్ ఇవ్వటాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించాలన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఎలా రియాక్టు అవుతారు? మంత్రి నారా లోకేశ్ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. బొజ్జా తీరును సొంత పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. ఆయన తండ్రి.. సీనియర్ నేతగా.. మాజీ మంత్రిగా గౌరవ మర్యాదలు ఉన్న తీరుకు భిన్నంగా తనయుడి తీరు ఉండటాన్ని తప్పు పడుతున్నారు.