పొత్తుల ఎఫెక్ట్.. బొజ్జల వారసుడికి టికెట్ లేనట్టేనా?
2014లోనూ విజయం దక్కించుకున్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చంద్రబాబుకేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
By: Tupaki Desk | 11 March 2024 10:51 AM GMTఏపీలో రాజకీయాలు మలుపులపై మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తామని చెప్పగా .. నేడు వీటికి బీజేపీ కూడా తోడైంది. దీంతో టికెట్లు ఆశించిన వారికి ఈ పొత్తుల ఎఫెక్ట్ భారీగానే తగులుతుండడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, దివంగత బొజ్జల గోపాలకృష్నారెడ్డి కుమారుడు.. బొజ్జల సుదీర్ రెడ్డికి ఇప్పుడు టికెట్ గండం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. సుదీర్ఘకాలంగా.. జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బొజ్జల కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. సుమారు 7 సార్లు గోపాలకృష్ణ విజయం దక్కించుకున్నారు.
2014లోనూ విజయం దక్కించుకున్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చంద్రబాబుకేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే.. ఆయన మరణం కారణంగా 2019లో ఆయన వారసుడు సుధీర్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన సుధీర్.. వైసీపీ గాలిలో ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ.. యువగళం పాదయాత్ర సమయంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యారు. ఇంకేముంది.. టికెట్ తనదేనని కూడా భావించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని అనుకున్నారు.
అయితే.. బీజేపీతో తాజాగా టీడీపీ చేతులు కలపడంతో శ్రీకాళహస్తిపై కమల నాథుల కన్ను పడింది. దీంతో ఈ సీటును బీజేపీకి ఇస్తారా? అనే చర్చ సాగుతోంది. ఈ పరిణామం.. టీడీపీ యువ నాయకుడు బొజ్జల సుధీర్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే.. వాస్తవానికి తొలి జాబితాలో 94 మంది పేర్లు ప్రకటించిన చంద్రబాబు ఆ జాబితాలో సుధీర్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా.. పార్టీలో సర్వే జరుగుతోందని చెప్పారు. అయితే. అంతర్గతంగా బీజేపీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే శ్రీకాళహస్తి అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం.
ఇక, ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేనలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి టికెట్ బీజేపీకి ఇస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ప్రజల్లో సుధీర్‌కు సానుభూతి కరువైందని చంద్రబాబుకు పలు సర్వేల ద్వారా వెల్లడైనట్టు సమాచారం. మరోవైపు.. పార్టీలోనే మరో నేత కూడా .. ఈ టికెట్‌ను కోరుతున్నారు దీంతో ఇరువురికి ఇవ్వకుండా.. బీజేపీ ఇచ్చేస్తే బెటర్ ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.
కమలం తరఫున కోలా!
బీజేపీ తరఫున శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసేందుకు కోలా ఆనంద్ సిద్దంగానే ఉన్నాడు. తరచుగా మీడియా ముందుకు, చానెళ్లలో చర్చలకు కూడా వచ్చే కోలా ఆనంద్‌కు నియోజకవర్గంలో మంచి పేరుంది. పైగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్‌కు టికెట్ ఇస్తే బీసీ సెంటిమెంటు కూడా కలిసి వస్తుందని బాబు ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేన మద్దతు ఉండనే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇదే జరిగితే.. బొజ్జల కుటుంబాన్ని బాబు పక్కన పెట్టారన్న అపప్రద అయితే మూటగట్టుకోవాలి.