Begin typing your search above and press return to search.

పుష్ప-2 డైలాగ్స్... జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!

అవును... పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా నెట్టింట చిన్న సైజు యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Dec 2024 9:50 AM GMT
పుష్ప-2 డైలాగ్స్... జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!
X

"పుష్ప-2" సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగులు రాజకీయ రంగు పులుముకుంటున్న సంగతి తెలిసిందే! ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అంతకంటే ముందు ఈ సినిమాను అడ్డుకుంటామంటూ ఓ జనసేన నేత ప్రకటించగా... అల్లు ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ రెండూ ఒక్కటే అంటూ మరో జనసేన నేత తాజాగా స్పందించారు.

అవును... పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా నెట్టింట చిన్న సైజు యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. అల్లు వర్సెస్ మెగా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సమయంలో... జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... అల్లు రామలింగయ్య గారి కుటుంబం, మెగాస్టార్ కుటుంబం రెండు కాదు ఒక్కటే అని నొక్కి చెప్పారు.

వీరంతా పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తులే అని.. వాళ్ళు స్వయంకృషితో ఎదిగారే తప్ప, కుటుంబం పేరు వాడుకొని ఎదిగలేదని.. అందుకే ఆ కుటుంబం అంటే అభిమానులకు కొండంత అభిమానం అని బొలిశెట్టి సత్యనారాయణ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బొలిశెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు.

జనసేన సహిత ఎన్డీయే కూటమి ఏర్పడకుండా జగన్ తన మీడియా, పెంపుడు మీడియా, పెయిడ్ సోషల్ మీడియా, తప్పుడు అనలిస్టులతో దుష్ప్రచారాలు చేశారని.. ఏ చిన్న అవకాశం వచ్చినా చిరంజీవి తమకే మద్దతు ఇస్తున్నారని.. ఐనప్పటికీ మెగా ఉమ్మడి కుటుంబంలో అగ్గి రాజేయడానికి వైసీపీ నాయకులు శతవిధాలా కష్టపడ్డారని రాసుకొచ్చారు.





అయినప్పటికీ పవన్ కల్యాణ్ దూరదృష్టి, వ్యూహం ముందు అవి పనిచేయలేదని అన్నారు. ఇప్పుడు అదే వైసీపీ పెంపుడు మీడియా, పెయిడ్ అనలిస్టులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నారని.. పుష్ప-2 లో అల్లు అర్జున్ సినిమా డైలాగులకు పెడార్థాలు తీసి, మెగా కుటుంబంలో అగ్గి రాజేసే పనిలో ఫుల్ టైం మెగా అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు.

ఈ సందర్భంగా... సినిమాలను సినిమాలుగానే చూడాలని, వైసీపీ ట్రాప్ లో పడకండి అంటూ సత్యనారాయణ సూచించారు. అన్న.. తమ్ముడి జీవితాన్ని నాశనం చేసి నరకాన్ని చూపించి అవమానపరిచినా.. ఆ అన్న కూతురికి కష్టం వస్తే పుష్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సన్నివేశంతో రక్త సంబంధం గురించి సుకుమార్ చాలా అర్ధవంతమైన సూచనలు చేశారని విశ్లేషించారు.

అనంతరం.. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఆర్జీవీ సినిమా తీయగలడా అని ప్రశ్నించిన బొలిశెట్టి.. పవన్, చిరంజీవిని తక్కువ చేసి సినిమాలు తీసి, ప్రజలను నమ్మిచే ప్రయత్నం చేసిన ఆర్జీవీ పరిస్థితి చివరికి ఏమయ్యింది? అని అన్నారు. సినిమాను సినిమాలాగానే చూడాలని.. చూద్దామని తెలిపారు.

"ప్రజా చైతన్యంతో రాజకీయాలలో మార్పు తెచ్చే పనిలో.. సనతన ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ దేశమంతటా ట్రెండ్ సెట్ చేశారు.. ఆయన చెప్పింది చేద్దాం.. మన రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.. విడదీసి పాలించే బ్రిటిష్ సంస్కృతి వాడిది.. జతకట్టి పాలించే భారతీయ సంస్కృతి మనది!" అని బొలిశెట్టి రాసుకొచ్చారు!!