Begin typing your search above and press return to search.

పవన్ కు జనసేన నేత బొలిశెట్టి ఫిర్యాదు... వీడియో వైరల్!

దీనిపై మెరుగు నాగార్జున ఛాలెంజ్ విసిరినా.. నాటి వైసీపీ మంత్రులు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   16 July 2024 11:13 AM GMT
పవన్  కు జనసేన నేత బొలిశెట్టి ఫిర్యాదు... వీడియో వైరల్!
X

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంలో.. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ప్రధాన భూమిక పోషించాయనేది కూటమి నేతల తీవ్ర విమర్శ. ఈ క్రమంలో సహజ వనరుల దోపిడీపై ఇప్పటికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మెరుగు నాగార్జున ఛాలెంజ్ విసిరినా.. నాటి వైసీపీ మంత్రులు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు.

ఆ సంగతి అలా ఉంటే... గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా వెళ్లి పోరాటాలు చేసిన వారిలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముందువరుసలో ఉంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి నాటి స్వరాన్నే వినిపించారు. పవన్ కు ఫిర్యాదు చేశారు.

అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయినప్పటికీ పలు చోట్ల పలు అక్రమాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయనే చర్చ తెరపైకి వస్తోంది! ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను అక్రమంగా తవ్వేసున్నారంటూ బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ లో వీడియో, కొన్ని స్క్రీన్ షాట్ లను షేర్ చేస్తూ.. ఎర్రమట్టి దిబ్బల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. ఈ తవ్వకాలను ఆపాలని పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. పైగా పవన్ కల్యాణే పర్యావరణ మంత్రి కావడంతో... రియాక్షన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సందర్భంగా ఎర్రమట్టి తిన్నెల ఔన్యత్యాన్ని వివరించారు బొలిశెట్టి సత్యనారాయణ. ఇందులో భాగంగా... ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని.. అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగమని తన ట్వీట్ లో తెలిపారు బొలిశెట్టి. ఇదే సమయంలో... దేశంలో ఇవి రెండు మాత్రమే ఉన్నాయని అన్నారు.

వీటిలో ఒకటి ఇక్కడ విశాఖ భీమునిపట్నంలో ఉండగా.. ఇంకొకటి తమిళనాడులోని పెరి వద్ద ఉన్నాయని తెలిపారు. ఇంతటి అరుదైన ప్రకృతి సంపదపై ఎదేచ్చగా దాడి జరుగుతుందని తనకు సమాచారం వచ్చిందని చెబుతూ దానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన... అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.

ఈ క్రమంలోనే... ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు కూడా తెలియజేస్తున్నట్లు ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. పవన్ కి ట్యాగ్ చేశారు. దీంతో... ఈ వ్యవహారంపై పవన్ రియాక్షన్ ఎప్పుడు, ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది!