"అల్లు అర్జున్ స్మగ్లర్ కాదు, స్మగ్లర్ పాత్ర పోషించాడు"... జనసేన నేత వ్యాఖ్యలు!
అనంతరం రికార్డుల్లో ఉన్న వాస్తవాలను బట్టి న్యాయమూర్తి తీర్పునిచ్చి శిక్షిస్తారని బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
By: Tupaki Desk | 24 Dec 2024 1:36 PM GMTప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, తదనంతర పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా తెలంగాణ విషయానికొస్తే... ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూనే కాంగ్రెస్, బీఆరెస్స్, బీజేపీ రాజకీయాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఈ కేసు వ్యవహారంలో బీఆరెస్స్, బీజేపీ నేతలు.. రేవంత్ సర్కార్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు అల్లు అర్జున్ కు బాసటగా నిలుస్తూ ఆన్ లైన్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు.
అవును... తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుపై జనసేన నేత స్పందించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జగన్ తరహాలో రేవంత్ పాలన కొనసాగుతుందని అన్నారు!
ఈ సందర్భంగా... కేసు నమోదు చేసి, సమాచారం సేకరించి, నిందితుడిని కోర్టుకు సమర్పించడమే ప్రభుత్వ పని అని.. అనంతరం రికార్డుల్లో ఉన్న వాస్తవాలను బట్టి న్యాయమూర్తి తీర్పునిచ్చి శిక్షిస్తారని బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేవలం అల్లు అర్జున్ పైనే ఫోకస్ చేసి ఓ హంతకుడిని ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని మొదలుపెట్టిన బొలిశెట్టి.. తెలంగాణలో ప్రతీ రోజు సుమరు 22 నుంచి 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. సరాసరిన సంవత్సరానికి 7 నుంచి 8 వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.
అయితే... రేవంత్ రెడ్డి మాత్రం రోడ్లు సరిగా లేక ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి గురించి ఆలోచించాలని అన్నారు. అలా కాకుండా.. తెలుగు ప్రజలకు, భారతీయ సినిమాకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఆయనను సత్కరించే బదులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు.
గతంలో ఏపీలో జగన్ కూడా ఇలాగే ప్రవర్తించారని.. ఫలితంగా 151 కాస్తా 11కి పడిపోయిందని.. త్వరలో రేవంత్ పరిస్థితి కూడా అదే అన్నట్లుగా బొలిశెట్టి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఎవరికి వారు, వారు వారు చేసిన పనులను బట్టి కర్మ అనుభవించాల్సి వస్తుందని.. జగన్ తరహాలోనే రేవంత్ కు శిక్ష తప్పదని బొలిశెట్టి చెప్పుకొచ్చారు!
ఈ నేపథ్యంలోనే.. అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ కాదని.. అతను ఎర్ర చందనం స్మగ్లర్ పాత్ర మాత్రమే పోషించాడని బొలిశెట్టి వ్యాఖ్యానించారు.