Begin typing your search above and press return to search.

జపాన్ ఎయిర్ పోర్ట్ లో పేలిన అమెరికా బాంబు... వీడియో వైరల్!

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న డిఫెన్స్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చెరుకున్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 3:54 AM GMT
జపాన్  ఎయిర్  పోర్ట్  లో పేలిన అమెరికా బాంబు... వీడియో వైరల్!
X

ఓ పక్క రష్యా - ఉక్రెయిన్.. మరోపక్క ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య బాంబుల వర్షాలు కురుస్తున్న వేళ.. ఎక్కడ బాంబు శబ్ధం వినిపించినా యుద్ధ సందేహాలు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్ లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకొంది. ఇందులో భాగంగా అక్కడ ఎయిర్ పోర్ట్ లో అమెరికాకు చెందిన బాంబు పేలింది. అయితే.. ఇక్కడే ఉంది బిగ్ ట్విస్ట్!

అవును... జపాన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... మియాజాకీ ఎయిర్ పోర్ట్ లో అమెరికాకు చెందిన బాంబు ఒకటి పేలింది. అయితే.. ఇది ఇప్పుడు జపాన్ పై అమెరికా వేసిన బాంబు కాదు సుమా... ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు అట. ఈ విషయాని జపాన్ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. అయితే ఆ పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని.. ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని అంటున్నారు! అయితే... ఈ పేలుడు కారణంగా ఏర్పడిన గొయ్యి వల్ల సుమారు 80కి పైగా విమానాల రాకపోకలు రద్దైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న డిఫెన్స్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చెరుకున్నారు. సుమారు 500 పౌండ్ల బరువున్న బాంబు వల్ల ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ బాంబును పాతిపెట్టారని.. అయితే ఇన్నేళ్ల తర్వాత అది పేలిందని అధికారులు చెబుతున్నారు.

కాగా... 1943లో నిర్మించిన ఈ మియాజాకీ విమానాశ్రయాన్ని మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫైట్ ట్రైనింగ్ ఫీల్డ్ గా ఉపయోగించేవారని చెబుతారు. ఈ సమయంలో... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం వేసిన బాంబుల్లో కొన్ని పేలనివి ఈ ప్రాంతంలో ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

ఇలా విమానాశ్రయంలో పేలని బాంబులు దొరకడం ఇదే తొలిసారి కాదు. 79 సంవత్సరాల క్రితం రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటికీ.. జపాన్ అంతటా యుద్ధకాల వైమానిక దాడుల అవశేషాలు ఇప్పటికీ కనుగొనబడుతున్నాయని అంటున్నారు. 2023లో మొత్తం 37.5 టన్నుల బరువున్న 2,348 బాంబులను సురక్షితంగా తొలగించారు.