Begin typing your search above and press return to search.

ఢిల్లీలోని మల్టీఫ్లెక్స్ సమీపంలో బాంబు పేలుడు... వారిపనేనా?

ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని ఓ మల్టీఫ్లెక్స్ సమీపంలో మరోసారి భారీ పేలుడు సంభవించింది.

By:  Tupaki Desk   |   28 Nov 2024 9:29 AM GMT
ఢిల్లీలోని మల్టీఫ్లెక్స్  సమీపంలో బాంబు పేలుడు... వారిపనేనా?
X

సరిగ్గా నెల రోజుల క్రితం దేశరాజధాని ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల ఎదుట పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతోపాటు స్కూలు గోడ కూడా కూలిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని ఓ మల్టీఫ్లెక్స్ సమీపంలో మరోసారి భారీ పేలుడు సంభవించింది.

అవును... దేశ రాజధానిలోని ప్రశాంత్ విహార్ లో గల పీవీఆర్ మల్టిఫ్లెక్స్ సమీపంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏమి జరుగుతుందో కాసేపు అర్ధం కాలేదని అన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఈ సమయంలో పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు... ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్భంధ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే... ఇప్పుడు పేలిన బాంబు తక్కువ తీవ్ర కలిగినది అయ్యి ఉంటుందని భావిస్తున్నారు!

కాగా... సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ ఎదుట బాంబు బ్లాస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడు ధాటికి స్కూల్ గోడ కూలిపోయింది. ఆ స్కూల్ సమీపంలో ఉన్న షాపులు, కార్లు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో... దట్టమైన పొగ వ్యాపించింది!

అయితే... ఈ బ్లాస్ట్ వెనుక ఖలిస్థానీ హస్తం ఉన్నట్లు నాడు వార్తలు హల్ చల్ చేశాయి. వీటికి బలం చేకూరుస్తూ... ఈ పేలుడు పాల్పడింది తామేనంటూ ఖలీస్థానీ అనుకూల గ్రూపు "జస్టీస్ లీగ్ ఇండియా" ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో తాజా పేలుడు కూడా అచ్చు నాటి ఘటనలాగే ఉందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది!