Begin typing your search above and press return to search.

బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్.. తెరపైకి సంచలన నిర్ణయం!

ప్రధానంగా గత నాలుగు రోజులుగా భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 Oct 2024 12:02 PM GMT
బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్.. తెరపైకి సంచలన నిర్ణయం!
X

ఇటీవల కాలంలో విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గత నాలుగు రోజులుగా భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. గడిచిన మూడు నెలల్లో వీటి సంఖ్య సుమారు 19 అని చెబుతున్నారు.

ఇక ప్రధానంగా గడిచిన 24 గంటల్లోనే సుమారు 9 విమానాలకు బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో.. పలు విమానాలను రూట్ మార్చడం, మరికొన్ని విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ సమయంలో పౌర విమానయాన సంస్థ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అవును... విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల తరచూ జరుగుతున్న పరిస్థితి. ఈ సమయంలో ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్రం ఆలోచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు పౌర విమానయన సంస్థ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని కథనాలొస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఇలాంటి ఆకతాయి పనులుచేసే వారిని నో-ఫ్లై లిస్ట్ లో యాడ్ చేయాలని పౌర విమానయాన సంస్థ చూస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో... అలాంటి పనులు చేసేవారికి కఠిన శిక్షలు విధించేలా "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ" (బీఏసీఎస్)లో పలు మార్పులు తీసుకురావాలని యోచిస్తోందని తెలుస్తోంది.

వాస్తవానికి విమానాల్లో చాలా మంది వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటుంటాయి. అయితే... ఇలాంటి పనులు చేసేవారికి వ్యతిరేకంగా పలు నిబంధనలు ఉన్నాయి కానీ... సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడేవారికి లేవు!

దీంతో... ఇలాంటి వారిని శిక్షించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఆకతాయిల బెదిరింపులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

కాగా... ఇటీవల ముంబై నుంచి బయలుదేరిన విమానానికి భద్రతా ముప్పు ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఘటనలో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమారుడు (17) ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో... అతడి తండ్రికి సమన్లు పంపిన పోలీసులు.. ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు.