ఎయిరిండియా సహా ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు!
అవును... మంగళవారం ఢిల్లీ నుంచి చికాగో వెళ్లే ఎయిరిండియా విమానంతో సహా ఐదు విమానాలకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో బాంబు బెదిరింపులు వచ్చాయి.
By: Tupaki Desk | 15 Oct 2024 4:48 PM GMTఇటీవల కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించి తెరపైకి వస్తోన్న పలు విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఐదు విమానాలకు ఆన్ లైన్ వేదికగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇందులో భాగంగా ఎయిరిండియాతో సహా ఐదు విమానాలకు ఈ మేరకు బాంబు బెదిరింపులు వచ్చాయి!
అవును... మంగళవారం ఢిల్లీ నుంచి చికాగో వెళ్లే ఎయిరిండియా విమానంతో సహా ఐదు విమానాలకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో... చికాగో వెళ్లాలసిన ఈ విమానాన్ని కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయానికి మళ్లించారు. దీనితో పాటు మరో నాలుగు విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతున్నారు!
ఇందులో భాగంగా... జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరుకు ప్రయాణించే ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం (ఐఎక్స్ 765), దర్భంగా నుంచి ముంబైకి వెళ్లే స్పైస్ జెట్ విమానం (ఎస్జీ 116), సిలిగురి నుంచి బెంగళూరుకు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం (క్యూపీ 1373), డమ్మాన్ నుంచి లక్నోకి వెళ్లే ఇండిగో ఫ్లైట్ (6ఐ 98) ఉన్నాయని అంటున్నారు.
నివేదికల ప్రకారం.. ఎక్స్ హ్యాండిల్ లో మంగళవారం నాలుగు విమానాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు జారీ అయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి అయొధ్య ఎయిర్ పోర్ట్ లో భద్రతా తనిఖీలు చేసారు. మరోపక్క స్పైస్ జెట్, ఆకాశా ఎయిర్ విమానాలు అప్పటికే ల్యాండ్ అయ్యాయని ఫ్లైట్ ట్రాకీంగ్ వెబ్ సైట్స్ ధృవీకరించాయి.
అయితే ఇవి బూటకపు బాంబు బెదిరింపులు అని తేలినట్లు తెలుస్తోంది. ఇది గుడ్ న్యూసే అయినప్పటికీ... ఈ బెదిరింపుల వల్ల వందల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని అంటున్నారు!