Begin typing your search above and press return to search.

బాబు పవన్ ఇద్దరూ ఇద్దరే !

అంతే కాదు ఆ పొత్తు పార్టీలు అధికారం చిక్కగానే విడిపోవడం అంతే నిజంగా సాగేది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 7:30 AM GMT
బాబు పవన్ ఇద్దరూ ఇద్దరే !
X

ఏపీ పాలిటిక్స్ కూటమిలో ఇద్దరు అగ్ర నేతల మధ్య సయోధ్య దేశ రాజకీయాల్లో పొత్తు పార్టీలకు సరికొత్త పాఠంగా మారనుంది అని అంటున్నారు. ఎందుకంటే దేశంలో దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. అంతే కాదు ఆ పొత్తు పార్టీలు అధికారం చిక్కగానే విడిపోవడం అంతే నిజంగా సాగేది.

ఎందుకంటే ఇప్పటిదాకా దేశ రాజకీయ చరిత్రలో పొత్తులు అంటే అధికారానికి దగ్గర దారి అన్న భావనతోనే ఉంటూ వస్తున్నాయి. అందుకే పొత్తులు ఎపుడూ పెడాకులే ఎక్కువగా అవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం టీడీపీ జనసేన రెండు పార్టీలు ఒక్కటిగా కలసి మెలసి ఉంటున్నాయి.

అంతే కాదు చంద్రబాబు పవన్ ఇద్దరి మధ్య బంధాన్ని అభివర్ణించడానికి కూడా మాటలు వెతుక్కోవాలేమో. పవన్ కి బాబు అంటే ఎనలేని గౌరవం. అలాగే బాబుకు పవన్ అంటే ఎంతో అభిమానం. చంద్రబాబు టోటల్ పొలిటికల్ హిస్టరీలో తన పక్క సీటు పరచి ఒక నేతను సమాన స్థాయిలో చూడడం ఇదే మొదటిసారి అని చెప్పుకుంటారు.

ఎందుకంటే 1995 ఎపిసోడ్ లో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బాబు అంగీకరించలేదు అంటారు. అటువంటిది మూడు దశాబ్దాల తరువాత పవన్ కి తనతో సమానమైన హోదా కల్పించడం అంటే బాబులో వచ్చిన మార్పుగా చూడాలా లేక రాజకీయ అనివార్యతగా చూడాలా లేక రాజకీయ వ్యూహంలో భాగంగా చూడాలా అన్నది చర్చగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ బాబు పవన్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు అన్నది అర్థం అవుతోంది.

అంతే కాదు బాబు ఎవరినీ నమ్మరు అన్న ప్రచారం కూడా ఉంది. కానీ అటువంటి ఆయన నమ్మకాన్ని పవన్ చూరగొన్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉంటారని ఆయనకు రాష్ట్ర అభివృద్ధి కంటే ఏదీ ఎక్కువ కాదని బాబు గ్రహించారని అంటున్నారు. ఆయనకు పదవీ వ్యామోహం కంటే ప్రజల శ్రేయస్సు కూడా ముఖ్యమని బాబు గట్టిగా విశ్వసిస్తున్నారు అంటారు. అందువల్లనే పవన్ విషయంలో బాబు చాలా బాగా ఉంటున్నారని చెబుతారు.

ఇక పవన్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబు మాత్రమే విభజన ఏపీని ఎంతగానో అభివృద్ధి చేయగలరని నమ్ముతున్నారు. బాబులో విజనరీ ఉన్నారని కూడా పవన్ విశ్వసిస్తారు. ఏపీని గట్టెక్కించడానికి బాబు రాజకీయ పాలనాపరమైన అనుభవం ఎంతగానో దోహదపడుతుందని కూడా పవన్ భావిస్తున్నారు.

అందుకే టీడీపీ కూటమి ఏపీని అభివృద్ధి చేయడానికి కనీసం పదేళ్ళ పాటు అధికారంలో ఉండాలని పవన్ భావించడమే కాదు బాబే సీఎం గా ఉండాలని ఓపెన్ గా నిండు అసెంబ్లీలో కోరుకుంటూ ప్రకటించారు. ఇక బాబు తప్ప ఏపీలో మరొకరు సీఎం అయితే ఏపీ మళ్ళీ ఇబ్బందులో పడుతుందని కూడా ఆయన భావిస్తున్నారు.

అందుకే రాజకీయ పొత్తుల కంటే కూడా ఏపీ అభివృద్ధి కోసం పొత్తులుగానే ఆయన చూస్తున్నారు. ఇక 2024లో వైసీపీ ఓటమి పాలు అయినా నలభై శాతం ఓటు షేర్ వచ్చింది. దాంతో మరో ఎన్నిక వరకూ వైసీపీ గట్టిగానే ఉంటుందని రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక వైసీపీతోనే 2029 ఎన్నికలు అన్నది కూడా కూటమి పెద్దలైన బాబు పవన్ లకు బాగా తెలుసు అని అంటున్నారు. అందువల్ల మరో ఎన్నికలలో కూడా జగన్ రాకుండా నిలువరించాలీ అంటే తమ రెండు పార్టీల మధ్య పొత్తులు అదే స్పిరిట్ తో ముందుకు తీసుకుని పోవడం అవసరం అని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

మొత్తానికి అధికారం దక్కిన తరువాత కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చి పొత్తు చిత్తు అవుతుందని వైసీపీ సహా ఎవరు భావించినా అది కేవలం అత్యాశగానే మిగిలిపోతుందని కూడా ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇక జమిలి ఎన్నికలు తోసుకుని వచ్చినా లేక 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగానే ఎన్నికలను ఎదుర్కొంటాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే గెలుపు ఖాయం అన్న పాజిటివిటీ జనంలో ఉంది.

దాంతో వైసీపీకి ఈ కూటమి బలంగా ఉండడం ఇబ్బందే. కానీ జగన్ ని మళ్లీ ఓడించాలన్న పంతంతోనే టీడీపీ జనసేన పట్టుదలగా పనిచేస్తున్నాయి. ఈ రాజకీయం తెలిసిన వారు ఏపీలో పరిణామాల మీద పూర్తి అవగాహన ఉన్న వారూ వైసీపీలో ఉంటే ఇబ్బందే అనుకుంటూ కూటమి వైపుగా చూస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు జగన్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఏపీ రాజకీయాల్లో నిలుస్తున్నారు అన్నది చెప్పక తప్పదు.