మీడియా మరిచిపోయిన బొండా ఉమా.. !
బొండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
By: Tupaki Desk | 11 Sept 2024 3:55 AMబొండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈయన నియోజకవర్గంలోనే విజయవాడ కు వరదలు వచ్చాయి. సింగునగర్, రాధానగర్, నందమూరి నగర్, ప్రకాశ్ నగర్, శాంతి నగర్, నున్న ఔటర్ రింగ్ రోడ్డు మొదలు, కండ్రిక, రాజీవ్‌నగర్, పైపుల రోడ్డు, వాంబే కాలనీ, ఏవీఎస్ రోడ్డు.. ఇలా.. ఎక్కడ వరద వచ్చిందని ప్రభుత్వం చెబుతోందో.. అదంతా కూడా.. బొండా ఉమా నియోజకవర్గం పరిధిలోనే ఉంది. కానీ, ఆయన గురించి ఎక్కడా ప్రొజెక్టు కావడం లేదు.
కనీసం స్థానిక ఎమ్మెల్యేగా కూడా ఆయన గురించి ఎవరూ వార్తలు రాయడం లేదు. దీంతో అసలు బొండా ఉమా.. ఉన్నారా? లేరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. వాస్తవం ఏంటంటే.. బొండా ఉమా లేకపోతే.. చంద్రబాబు ఈ ప్రాంతంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని అంటున్నారు. వరదలు రాగానే సీఎంకు నేరుగా సమాచారం ఇచ్చిన దగ్గర నుంచి సీఎంను రప్పించడం వరకు బొండా ఉమా.. నిరంతరం పనిచేశారు. అంతేకాదు. ప్రత్యేకంగా బోట్లు తెప్పించారు.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఇక, నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఆయనకు తెలుసు కాబట్టి వెంటనే ఆదిశగా కూడా ఆయన చర్యలు చేపట్టారు. దీంతో ప్రాణ నష్టం సంభవించలేదు. బాధితులను ఆదుకునేందుకు బొండా ఉమా యూత్ పేరుతో అప్పటికప్పుడు సత్యనా రాయణ పురం నుంచి యువతను తీసుకువచ్చి రంగంలోకి దింపారు. ప్రతి ఒక్కరినీ పలకరించారు. తన వాహనాలను కూడా పెట్టి బాధితులను తరలించారు.
గత 8 రోజులుగా ఒకే ఒక్క సారి ఇంటికి వెళ్లి బొండా ఉమా.. నిరంతరం ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు. ఎంపీ, స్థానిక నేతలను సమన్వయం చేసుకుని ముందుకు నడిచారు. బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూడా కృషి చేశారు. అయితే..ఆయన ఇంత చేస్తున్నా.. ఎలా ప్రొజెక్షన్ రాకపోవడం గమనార్హం. దీనికి కారణాలు వేరే ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయనే ప్రచారం వద్దన్నారని.. చేయాల్సిన పనిచేయాలని మాత్రమే చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా బొండా ఉమా.. మాత్రం ప్రజలకు సాయం చేయడంలో ముందున్నారనే చెప్పాలి.