Begin typing your search above and press return to search.

టార్గెట్ బోండా ఉమా.... మాజీ ఎమ్మెల్యేకు ఉచ్చు !

ఇదిలా ఉంటే బోండా ఉమా టీడీపీలో కీలక నాయకుడిగా అయిపోయారు. ఏకంగా పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా అయ్యారు

By:  Tupaki Desk   |   18 April 2024 3:53 AM GMT
టార్గెట్ బోండా ఉమా.... మాజీ ఎమ్మెల్యేకు ఉచ్చు  !
X

విజయవాడలో టీడీపీకి బిగ్ వాయిస్ గా బోండా ఉమాను చెబుతారు. ఆయన 2014లో మొదటిసారిగా టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆయన ఓటమిని చవిచూసారు. మూడవసారి మళ్లీ ఆయన పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బోండా ఉమా టీడీపీలో కీలక నాయకుడిగా అయిపోయారు. ఏకంగా పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా అయ్యారు.

ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రాజధాని నగరంగా చెప్పుకునే విజయవాడలో ఆయన టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా వైసీపీని ఎపుడూ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆయనను ఈసారి ఓడించాలని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టి మరీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని దింపింది.

ఇదిలా ఉంటే గత శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ పరిధిలో ఉండగా ఆయన మీద రాయి పడింది. నుదుటి మీద గాయం అయింది. దాంతో ఇది జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. దీని మీద పోలీసులు లోతైన దర్యాప్తు మొదలెట్టారు. ఇది అటూ ఇటూ తిరిగి బోండా ఉమా దాకా వెళ్ళింది. బోండా ఉమా దగ్గర పనిచేసే వేముల దుర్గారావు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బోండా ఉమా ఫైర్ అయ్యారు.

ఈ కేసులో నన్ను అకారణంగా ఇరికిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఏమైనా జరిగితే తాను చూస్తూ ఊరుకోనని బాధ్యుల మీద జూన్ 4 తరువాత తన చర్యలు ఉంటాయని ఘాటైన హెచ్చరిక చేశారు. జగన్ మీద రాళ్ళు వేసిన యువకుడు దొరికాడని, వాళ్ల ఇంటి పక్కనే అన్న క్యాంటీన్ ఉండేదని, అన్న క్యాంటీన్ తీసేశారని, వారికి 300 ఇస్తామని ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశారని బాధతో కోపంతో చీకట్లో ఒక రాయి విసిరాడని బోండా ఉమా చెప్పారు.

ఇది దురదృష్టవశాత్తు సీఎం జగన్ కి తగిలిందని అంతే తప్ప, అదేమంత పెద్ద విషయం కాదని బోండా ఉమా అంటున్నారు. అయితే ఈ కేసులో కోరి తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. ఆ సంఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి నేనే కారణం అంటున్నారని బోండా ఉమా మండిపడ్డారు.

ఎలాంటి పరిస్థితుల్లో నా పేరును తీసుకువస్తూ కేసును పెట్టించారో ఎవరు కేసు బుక్ చేశారో ఎవరు విచారణ చేస్తున్నారో వారంతా నా పేరును ప్రస్తావిస్తే మాత్రం జూన్ 4 తర్వాత కచ్చితంగా వారంతా కేసుల్లో ఇరుక్కుంటారని బోండా ఉమా హెచ్చరించడం విశేషం. ఇదిలా ఉంటే ఆ రోజున జగన్ బస్సు యాత్రలో బోండా ఉమా మీద సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే టీడీపీలో ఉన్నపుడు బోండా ఉమాను వ్యతిరేకించే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని ఉన్నారు.

ఇపుడు బోండా ఉమాను టార్గెట్ చేశారు అని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయంగా చూస్తే ఇందులో ఎన్నో చిక్కు ముడులు ఉన్నాయని కూడా అంటున్నారు. జగన్ మీద దాడి జరిగాక వెంటనే వైసీపీ నేతలు టీడీపీ చేసిన పనే అంటూ విమర్శించారు. ఇక వైసీపీ క్యాడర్ అయితే బోండా ఉమాయే చేయించాడు అని నిందించడం జరిగింది. ఇపుడు బోండా ఉమాను అరెస్ట్ చేసే దాకా ఈ కేసు నడిచేలా ఉంది.

ఇంతకీ బోండా ఉమాకు సంబంధం ఉందా లేదా అన్నది విచారణలో తేలుతుంది కానీ బోండా ఉమా మాత్రం వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి తనను ఇరికిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ మీద దాడి వ్యవహారం కాస్తా బోండా ఉమాకు ఉచ్చు బిగిసేలా చేస్తోంది. వైసీపీ పాలనలో చాలా మంది టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. అందులో బోండా ఉమా ఉండాల్సింది లేరు. ఇపుడు ఆయన ప్రమేయం ఈ దాడిలో ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన అరెస్ట్ అయితే మాత్రం వైసీపీ టార్గెట్ చేసిన టీడీపీ నేతల లిస్ట్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు.