విజయవాడ టీడీపీలో బొండా ఉమా రచ్చ చేసుకుంటున్నాడా...!
విజయవాడలో కీలకమైన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది.
By: Tupaki Desk | 29 Dec 2023 5:11 AM GMTవిజయవాడలో కీలకమైన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అసలు గెలుస్తుందో లేదో అనుకున్న వైసీపీ విజయం దక్కించుకుంది. అంటే కేవలం 25 ఓట్ల తేడాతోనే టీడీపీ ఇక్కడ ఓడిపోయిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంత కీలక నియోజకవర్గంలో(అంటే.. బొటాబొటీగా ఉన్న ఓటు బ్యాంకు) మరి ఎంత బాగా టీడీపీ పుంజుకోవాలి? అనేది ప్రశ్న.
ఈ విషయంలో పార్టీని ఏమీ అనాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు.నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకోవద్దని కానీ.. పొత్తు పార్టీ అయిన.. జనసేనతో కలిసి పనిచేయొద్దని కానీ ఆయన చెప్పలేదు. పైగా కలిసి మెలిసి పనిచేయాలనే చెప్పారు. సమన్వయం తో ముందుకు సాగాలని కూడా పదే పదే సూచిస్తున్నారు. అయితే.. విజయవాడ సెంట్రల్‌లో మాత్రం ఈ తరహా సమన్వయం.. కలిసిముందుకు సాగడం అనేది కనిపించడం లేదు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న బొండా ఉమా మహేశ్వర రావు.. తనకు తీరిక వేళ దొరికితే.. మీడియా ముందుకు వస్తున్నారు. లేకపోతే.. లేదు.. అన్నట్టుగా వ్యవ హరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సెంట్రల్ టికెట్‌ను జనసేన యువ నాయకుడు కాపు(కృష్ణ బలి జ) సామాజిక వర్గానికి చెందిన శోడిశెట్టి రాధ ఆశిస్తున్నారు. ఈయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రంగా వర్ధంతిని నియోజకవర్గంలో ఘనంగా కూడా నిర్వహించారు.
అయితే.. ఈయనకు టికెట్ ఇస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. జనసేనతో మైత్రి చేసి.. వారితో కలిసి కార్యక్రమాలు చేయాల్సిన బొండా ఉమా మాత్రం.. వారిని అసలు లెక్క కూడా చేయడం లేదు. ఇంతవరకు నియోజకవర్గం స్థాయిలో సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు. స్థానికులతో మమేకం కూడా కాలేదు. ఇక, ఎన్నికలకు మరో మూడు మాసాలే గడువు ఉన్న నేపథ్యంలో బొండా అనుచరులు కూడా.. ఏం చేస్తారో చూడాలన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరిణామం వెనుక అతి నమ్మకం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.