గులాబీ పార్టీకి భారీ షాక్.. రేవంత్ ను కలిసిన కేటీఆర్ భక్తుడు
మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. ఆయన భక్తుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు
By: Tupaki Desk | 12 Feb 2024 4:53 AM GMTశాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు లేని ఏకైక రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయమే. నిన్నటి వరకు తన రాజకీ ప్రత్యర్థులపై బండ బూతులు తిట్టేసి.. తర్వాతి రోజుకు భుజాన తిట్టేసిన పార్టీ కండువా కప్పేసుకునే టాలెంట్ ఉన్న రోజులు. అలాంటి వేళ.. ఎవరెప్పుడు పార్టీలు మారతారో ఊహించటం కష్టం. చేతిలో అధికారం ఉండాలే కానీ ఎంతటివాడైనా సరే.. పార్టీ గోడ దూకేసేందుకు అస్సలు వెనుకా ముందు ఆడని పరిస్థితి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి బీఆర్ఎస్ కు షాకిచ్చారు హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్.
మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. ఆయన భక్తుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పూలబొకేను తీసుకెళ్లి మరీ ఆయన్ను కలిసిన బొంతు.. త్వరలో గులాబీ కారు దిగేసి.. కాంగ్రెస్ కండువాను మెడలో కప్పేసుకుంటారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. హైదరాబాద్ మహానగరంలో తన హవాను ప్రదర్శించింది. గ్రేటర్ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ కు ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పార్టీలోకి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వనిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో పట్టు పెంచుకోవటానికి వీలుగా ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసింది. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ కు చెందిన మాజీ డిప్యుటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. తాజాగా కేటీఆర్ భక్తుడిగా పేర్కొనే బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలవటం రాజకీయ సంచలనంగా మారింది.
బొంతు లాంటి నేతనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తున్నారంటే.. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగర బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు పార్టీ మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహానగరంలోని ఆరేడుగురు గులాబీ ఎమ్మెల్యేలు గోడ దూకేసి.. కాంగ్రెస్ కండువా వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. కప్పదాట్లకు సిద్ధమవుతున్న వారిని బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బొంతు.. అందుకు భిన్నమైన వాతావరణం చోటు చేసుకోవటంతో తీవ్ర అసంత్రప్తితో ఉన్నారు. సమీప భవిష్యత్తులో ఎలాంటి పదవికి నోచుకోలేని పరిస్థితులు ఎదురవుతాయన్న నిర్ణయానికి వచ్చిన బొంతు.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంచి రోజు చూసుకొని కారు దిగేసి.. కాంగ్రెస్ పార్టీలోకి కాలు పెట్టేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగాగ్రేటర్ హైదరాబాద్ ను టార్గెట్ చేసుకొని జరుగుతున్న ప్రయత్నాలు ఎంపీ ఎన్నికలకు ముందే పూర్తి అవుతాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.