కూటమి ప్రభుత్వం లో ఉద్యోగులు భయపడుతున్నారా ?
ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారని చెప్పడం విశెషం.
By: Tupaki Desk | 26 Aug 2024 5:30 PM GMTప్రభుత్వ ఉద్యోగులు ఎపుడూ తమకు నచ్చిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటారు. ప్రతీ అయిదేళ్లకి ఒకసారి వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది అని ప్రచారం సాగుతుంది. అంతే కాదు ఉద్యోగులతో ఎవరు పెట్టుకున్నా వారు ఇబ్బందులలో పడతారు అని కూడా అంటూంటారు.
వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిన ఉద్యోగులు అంతా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారని ప్రచారంలో ఉన్న మాట. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఉద్యోగ వర్గాలు ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉండాలి. కానీ ఉద్యోగులు భయపడుతున్నారు అన్న చర్చ అయితే ఇప్పటికే సాగుతోంది.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బయటకు లెక్క తీసే క్రమంలో తొలి దెబ్బ ఉద్యోగుల మీదనే పడుతోంది అన్న ఆవేదన కూడా వారిలో గూడు కట్టుకుని ఉందని అంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తారు. అందులో తప్పొప్పులకు బాధ్యత ఎక్కువగా రాజకీయ నేతలకే ఉంటుంది.
అయితే వారు ఓడిన పెద్దగా ఇబ్బంది ఉండదు, వారు తప్పించుకునే వీలు ఉంటుంది. వారి కంటే ముందు ఉద్యోగులే దొరికిపోతూంటారు అని కూడా అంటారు. ఇపుడు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా సాగుతున్న పొలిటికల్ వార్ లో మధ్య పడి ఉద్యోగులు నలుగుతున్నారు అని అంటున్నారు. ఉద్యోగులు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేయాల్సిందే.
వారు తప్పించుకోవడానికి లేదు. పైగా వారి పాత్ర పరిమితం అయినా టార్గెట్ గా వారే అవుతున్నారు. దాంతో పాటు అధికార కూటమిలోని నేతలు సీనియర్లు సైతం ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చే తీరున ప్రకటనలు చేయడం కూడా వారిని కలవరపెడుతోంది. దీంతో ఉద్యోగులు తీవ్ర మధనం చెందుతున్నారు.
అయితే ఉద్యోగుల మనసులో ఉన్న బడబాగ్నిని ఆ సంఘం నాయకులు అయితే ఇపుడు బయటపడి చెబుతున్నారు. ఏపీలో గత కొంతకాలంగా సాగుతున్న ఫైళ్ల దహనం విషయంలో చూస్తే కనుక రాజకీయ దుమారమే రేగుతోంది. అవసరం అయిన ఫైళ్ళు, ముఖ్యమైన అయిన ఫైళ్ళు దహనం చేస్తున్నారు. తప్పుకు దొరకకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారు అని కూడా ఆరోపణలు అధికార కూటమి వైపు నుంచి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నుంచి చూస్తే ఉద్యోగుల మీద చర్యలు ఉంటాయని అన్నట్లుగా కూటమి పెద్దల నుంచి హెచ్చరికలు వస్తున్న క్రమంలో ఆ సంఘం కీలక నేతలు ఎట్టకేలకు పెదవి విప్పి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారని చెప్పడం విశెషం. అసలు ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టడని బొప్పరాజు అన్నరు. ఇక మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉందని గుర్తు చేశారు.
అయినా ఎవరైనా ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదుని బొప్పరాజు అన్నరు. ఫైల్స్ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.
అసలు రాష్ట్రంలో ఎక్కడా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా అని అడిగారు. అంతే కాదు రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులు ఉన్నారా అని కూడా ప్రశ్నించారు. ఇక ఏపీలో చూస్తే అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అలాంటి పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా అని బొప్పరాజు అంటున్నారు.
మొత్తం మీద చూస్తే బొప్పరాజు మాటలలో రెవిన్యూ ఉద్యోగుల ఆవేదన ఉంది. తాము కావాలని ఏ ఫైల్ తగులబెట్టలేదని తమ తప్పు కాదని అన్న వారి వాదననే బొప్పరాజు మీడియా ముఖంగా ప్రభుత్వం ముందు పెట్టారు. వీటితో పాటుగా ఉద్యోగులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు అన్న ఆయన వ్యాఖ్యలే ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించి ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.