Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎంపీ!

తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్‌ ఇంటికి ఎంపీ వెంకటేష్‌ వెళ్లారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 7:40 AM GMT
బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎంపీ!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ను మట్టి కరిపించిన కాంగ్రెస్‌ పార్టీ తన దూకుడు కొనసాగిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కొల్లగొట్టడానికి వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. బీఆర్‌ఎస్‌ కు చెందిన పెద్దపల్లి లోక్‌ సభా నియోజకవర్గం ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ పార్టీలోకి దూకేశారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత పార్టీ మారడం పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ అంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ కే విజయావకాశాలు కనిపిస్తుండటంతో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్‌ ఇంటికి ఎంపీ వెంకటేష్‌ వెళ్లారు. ఆయనకు కేసీ వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, ఎంపీ వెంకటేష్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ లో చేరారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తాజాగా బీఆర్‌ఎస్‌ కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా వెంకటేశ్‌ నేత పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ లో చేరారు. దీంతో కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ ఇచ్చి పెద్దపల్లి నుంచి లోక్‌ సభ కు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో వెంకటేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌ పై 95 వేల మెజారిటీతో గెలుపొందారు.

లోక్‌ సభ ఎన్నికల వేళ సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ పార్టీ మారడం బీఆర్‌ఎస్‌ కు పెద్ద ఎదురుదెబ్బ అని అంటున్నారు. ఆయన బాటలో మరికొందరు కాంగ్రెస్‌ లోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.