Begin typing your search above and press return to search.

కేసుపై కేసు.. గుం'టూరు'కు బోరుగడ్డ

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   12 March 2025 4:06 PM IST
కేసుపై కేసు.. గుంటూరుకు బోరుగడ్డ
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాంతర బెయిల్ పై బయటకి వచ్చిన బోరుగడ్డ బుధవారం ఉదయం రాజమండ్రి జైలులో లొంగిపోయారు. ఈ విషయం తెలిసిన గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వచ్చి పీటీ వారంట్ పై అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో మధ్యాంతర బెయిల్ తీసుకున్నట్లు అనిల్ పై పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఆయనను తాజాగా అదుపులోకి తీసుకోడానికి ఇది కారణం కాదంటున్నారు.

పాస్టర్ ను బెదిరించారనే కేసులో బోరుగడ్డను మరోమారు అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు.. రాజమండ్రి సెంటల్ జైలు నుంచి పట్టాభిపురం పోలీసుస్టేషన్ కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు ఇతర మంత్రులు, టీడీపీ నేతలపై దుర్భాషలు, బెదిరింపులు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలపై బోరుగడ్డను గత ఏడాది అక్టోబరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ గత నెలలో తన తల్లికి ఆపరేషన్ చేయించాలని చెబుతూ మధ్యాంతర బెయిల్ తీసుకున్నాడు. నిన్నటి వరకు రెండు సార్లు బెయిల్ పొడిగింపు తెచ్చుకున్న బోరుగడ్డ.. ఈ రోజు ఉదయమే కోర్టులో లొంగిపోయారు.

అయితే తల్లి అనారోగ్యం చూపుతూ ఆయన బెయిల్ పొందినా, అందుకు నకిలీ డాక్యుమెంట్లు తీసుకున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు సంతకాలను ఫోర్జరీ చేశారని బోరుగడ్డపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే తన తల్లి ఆరోగ్యం నిజంగా బాగాలేదని, ఆమె చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బోరుగడ్డ వాదిస్తున్నాడు. బోరుగడ్డ తల్లికి ఆపరేషన్ జరిగినది వాస్తవమే అయినా, ఆయన చెన్నై వెళ్లలేదని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆయనపై ఫోర్జరీ, తప్పుడు పత్రాలతో బెయిల్ తీసుకున్నారనే కారణంతో మరో కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

కాగా, పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడం బోరుగడ్డ భవిష్యత్ ఆసక్తికరంగా మారింది. అక్రమంగా బెయిల్ తెచ్చుకున్నాడని బోరుగడ్డపై గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన తన తల్లి చికిత్స పేరు చెప్పి తెలంగాణ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బోరుగడ్డ అసలు తెలంగాణ ఎందుకు వెళ్లారు? ఎవరిని కలిశారు? బెయిల్ పై బయట సమయంలో ఏం చేశారనేది మిస్టరీగా మారింది. ఈ విషయాలను తెలుసుకునేందుకు పాస్టర్ కేసును తెరపైకి తెచ్చి బోరుగడ్డను అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.