Begin typing your search above and press return to search.

"నిన్ను బిర్యానీ ఫుడ్డు.. నేడు కంఫర్టబుల్ బెడ్డు"... బోరుగడ్డ వీడియో వైరల్!

ఈ సందర్భంగా చేయాల్సిన సేవలన్నీ చేసిన పోలీసులు.. పడుకొవడానికి ప్రత్యేకంగా టేబుల్ అరేంజ్ చేసి.. దానిపై దుప్పట్లు, దిండ్లు వేశారు.

By:  Tupaki Desk   |   9 Nov 2024 12:55 PM GMT
నిన్ను బిర్యానీ ఫుడ్డు.. నేడు  కంఫర్టబుల్  బెడ్డు... బోరుగడ్డ వీడియో  వైరల్!
X

గత ప్రభుత్వ హయాంలో ఏపీలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలకు కూడా జుగుప్స కలిగించేలా ప్రత్యర్థులపై విమర్శలు చేశారనే కామెంట్లూ వినిపించాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అనిల్ పై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు!

ఇందులో భాగంగా... 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడిని పోలీసులు పీటీ వారెంట్ పై కర్నూలుకు తీసుకువచ్చారు.

సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తెలుగుదేశం పార్టీ నేత తిలక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఇలా వరుసగా అనిల్ పై కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు. మరోపక్క అతడి విషయంలో పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అవును... గత నెల 26 నుంచి 29 వరకూ బోరుగడ్డ అనిల్ ను అరండల్ పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో ఆయనకు రాచమర్యాదలు చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా చేయాల్సిన సేవలన్నీ చేసిన పోలీసులు.. పడుకొవడానికి ప్రత్యేకంగా టేబుల్ అరేంజ్ చేసి.. దానిపై దుప్పట్లు, దిండ్లు వేశారు. సౌకర్యవంతమైన నిద్రకు సహకరించారు!!

దీనికి సంబంధించిన వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... దీనికి సంబంధించిన స్టేషన్ లోపటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు నెట్టింట దర్శనమిచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో... పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా.. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో బోరుగడ్డ అనిల్ తో పాటు పలువురు పోలీసులు గన్నవరంలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యానీ తినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీస్ అధికారులు సీరియస్ అవ్వడం, ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా స్టేషన్ లో రాచమర్యాదలకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది.