నా పరిస్థితి పగోడికి కూడా రావద్దు..బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో వైరల్
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో పోలీసులు కుట్ర పన్నారని, థర్డ్ డిగ్రీ ఇచ్చారని.. నాకు బ్లడ్ కూడా క్లాట్ అయ్యిందని.. కర్నూలులో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు.
By: Tupaki Desk | 9 March 2025 9:27 AM ISTగత నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నదని బోరుగడ్డ అనిల్ ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానని ఆయన తెలిపారు.
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్ల ప్రాణహాని ఉందని, వాళ్ల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఏదైనా జరిగితే, అందుకు పవన్ కల్యాణ్, లోకేశ్ బాధ్యత వహించాలని అన్నారు. తాను భగవంతుడు, జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా ఎవర్నీ నమ్మనని స్పష్టం చేశారు.
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో పోలీసులు కుట్ర పన్నారని, థర్డ్ డిగ్రీ ఇచ్చారని.. నాకు బ్లడ్ కూడా క్లాట్ అయ్యిందని.. కర్నూలులో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. తన తల్లి అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారని, ఆమెను చూసుకోవాల్సింది తానేనని పేర్కొన్నారు.
అయితే, తన తల్లి ఆరోగ్యం విషయంలో తాను కోర్టుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించానంటూ పోలీసులు ఆరోపిస్తున్నారని, ఆ సమయంలో తాను జైల్లో ఉండగా నకిలీ ధ్రువపత్రాలు ఎలా సృష్టిస్తానని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం చెన్నైలో ఉంటూ తన తల్లిని చూసుకుంటున్నానని, తనకు జగన్, వైసీపీ మినహా మరెవరూ దిక్కులేరని వాపోయారు. తనకు బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.