Begin typing your search above and press return to search.

బోరుగడ్డకు బిర్యానీ ట్రీట్... పోలీసుల మజాకు ఫలితం వచ్చేసింది!

ఈ సమయంలో తాజాగా బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది.. సీరియస్ రిజల్ట్ వచ్చేసింది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 4:00 AM GMT
బోరుగడ్డకు బిర్యానీ ట్రీట్... పోలీసుల మజాకు ఫలితం వచ్చేసింది!
X

చేసిన నేరాలను బట్టి నిందితుడికి పోలీసులు ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంటుంటాయని.. చిన్న చిన్న తప్పులు చేసిన వారి విషయంలో ఒకలా ఉంటే.. పెద్ద పెద్ద నేరాలు చేసిన వారి విషయంలో మరోలా ఉంటుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో తాజాగా బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది.. సీరియస్ రిజల్ట్ వచ్చేసింది.

అవును... గత ప్రభుత్వ హయాంలో చేయాల్సిన రచ్చ అంతా చేసి, అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అసభ్యకర దూషణలు చేసి, పలు కేసుల్లో అరెస్టై జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం..!

పలు కేసుల్లో అరెస్టై, జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు ఎస్కార్ట్ పోలీసులు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన కేసులకు సంబంధించి అనిల్ ను బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మధ్యాహ్నం రాజమండ్రికి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సమయంలో అనిల్ కు ఓ రెస్టారెంట్ లో దర్జాగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఎస్కార్ట్ టీమ్ లో... గుంటూరు జిల్లాకు ఏఆర్ కు చెందిన ఆరెస్సై నారాయణ రెడ్డి నేతృత్వంలోని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏఆర్ కానిస్టేబుళ్లు శంకర్ రావు, బుచ్చయ్య లతో పాటు తుళ్లూరు కానిస్టేబుళ్లు బాల ఎం శౌరి, నాగార్జున, తాడికొండ పీఎస్ కానిస్టేబుల్ సద్దులా ఉన్నారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీపీ.. ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

కాగా... నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోనే ఉంచి ఆహారం అందించాలి. అయితే... అనిల్ విషయంలో మాత్రం ఓ రెస్టారెంట్ వద్ద వాహనం ఆపిన పోలీసులు... అతడిని లోపలికి తీసుకెళ్లి.. చికెన్, మటన్ బిర్యానీలతో భోజనం పెట్టించారు. అతనితో కలిసి విందు ఆరగించారు. అనిల్ తోనే బిల్లు కట్టించారని తెలుస్తోంది! ప్రస్తుతం ఈ పోలీసులంతా సస్పెండ్ అయ్యారు!