ఎస్కార్టు పోలీసుల ముందు మీడియాకు బోరుగడ్డ మాస్ వార్నింగ్
పరిచయం చేయాల్సిన అవసరం లేని వివాదాస్పద వ్యక్తిగా పేరొందారు బోరుగడ్డ అనిల్.
By: Tupaki Desk | 31 Oct 2024 6:04 AM GMTపరిచయం చేయాల్సిన అవసరం లేని వివాదాస్పద వ్యక్తిగా పేరొందారు బోరుగడ్డ అనిల్. రాజకీయంగా తనకు నచ్చకుంటే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినన్ని మాటలు అనేయటం అలవాటున్న సంగతి తెలిసిందే. ఆయన మాటల ధాటికి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సహా.. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే పలుమార్లు దారుణ వ్యాఖ్యలకు గురయ్యారు.
సోషల్ మీడియాలో చెలరేగిపోతూ.. నోటికి అడ్డూ పొద్దు లేకుండా విరుచుకుపడే బోరుగడ్డను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తనను వైసీపీ నేతలు ముందుకు నెట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడమన్నారని.. అందుకే తాను రెచ్చిపోయి మాట్లాడినట్లుగా పోలీసులు విచారణలో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో ఆయన్నుఆయా స్టేషన్లకు తీసుకెళుతున్నారు.
తాజాగా శ్రీకాకుళం జడ్జి ఎదుట హాజరుపర్చారు. దీనికి కారణం గార పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గోర సురేష్ ఆయనపై కంప్లైంట్ చేయటం.. అది కాస్తా కేసు కావటంతో ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చారు. అనంతరం అతన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఎస్కార్టు పోలీసుల ముందే మీడియా సంస్థలకు మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పలు మీడియా సంస్థల్ని రాబోయే రోజుల్లో నడిరోడ్డు మీద నిలబెడతానంటూ రెచ్చిపోయారు. ఎస్కార్టు పోలీసుల ఎదుటే.. తీవ్రమైన ఆవేశానికి గురైన అతడి తీరు విస్మయానికి గురి చేసింది. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్నా.. అతడి బుద్ధి మాత్రం మారలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.