Begin typing your search above and press return to search.

విజయనగరంలో వైసీపీ జోరు.. ఆ ఒక్కడిని కట్టడి చేయలేమా? టీడీపీలో అంతర్మథనం

అయితే రాష్ట్రం అంతా ఈ జోరు చూపిస్తున్న టీడీపీ కూటమి ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోతోందని టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 April 2025 1:30 PM
విజయనగరంలో వైసీపీ జోరు.. ఆ ఒక్కడిని కట్టడి చేయలేమా? టీడీపీలో అంతర్మథనం
X

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి. తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ జోరులో రాష్ట్రం మొత్తం టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు హవా చూపుతున్నాయి. రాజకీయంగా వైసీపీపై పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. వలసను ప్రోత్సహిస్తూ ఫ్యాన్ పార్టీ గాలి తీసేస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అయితే అవకాశం ఉన్నచోటల్లా వైసీపీ క్యాడరును లాగేస్తూ పసుపు జెండా ఎగరేస్తున్నారు.

అయితే రాష్ట్రం అంతా ఈ జోరు చూపిస్తున్న టీడీపీ కూటమి ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసినా.. వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గలేదంటున్నారు. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండటంతో కూటమిలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.

రాష్ట్రంలో రాజకీయంగా కూటమి పార్టీలది.. మరీ ముఖ్యంగా టీడీపీది పైచేయి అయినా, విజయనగరం జిల్లాలో మాత్రం వైసీపీ జోరు చూపుతోందని అంటున్నారు. ఈ జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ, ఆయన మేనల్లుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను స్పీడు చూపుతున్నారు.

జడ్పీలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండటంతో విజయనగరం జిల్లాలో వైసీపీదే హవా అన్నట్లు రాజకీయం ప్రదర్శిస్తున్నారు. బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీనును రాజకీయంగా ఇరకాటంలో పెట్టలేక ఆ జిల్లా టీడీపీ నేతలు చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీకి బలమైన నేతలు ఉన్నా, బొత్స రాజకీయానికి బ్రేకులు వేయలేకపోవడంపై చర్చ జరుగుతోంది.

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు కొండపల్లి శ్రీనివాస్ కాగా, మరొకరు గుమ్మడి సంధ్యారాణి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా, అన్నిచోట్లా కూటమి పార్టీలే గెలిచాయి. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే ఉండగా, మిగిలిన 8 చోట్ల టీడీపీ గెలిచింది. ఈ 8 మందిలో సీనియర్ నేత, మాజీ మంత్రి కళావెంకటరావుతోపాటు కోళ్ల లలితకుమారి సీనియర్ ఎమ్మెల్యే. ఇక మిగిలిన ఆరుగురు కొత్తగా ఎన్నికైన వారే.. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారుకూడా తొలిసారే ఎమ్మెల్యేలు కావడంతో వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొత్స వంటి సీనియర్ నేతను ఎదుర్కోవడమంటే అంత అషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు.

అయితే టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా సౌమ్యులు కావడంతో వైసీపీకి దీటుగా రాజకీయం చేయలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాల్లో కొత్తగా గెలిచిన వారే ఏడుగురు ఉండటంతో జిల్లా పరిషత్ సమావేశాల్లో వైసీపీ పైచేయి సాధిస్తోందని అంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో సైతం జడ్పీ పీఠం అడ్డుపెట్టుకుని పెద్దరికం చేయాలని చూస్తోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా చూస్తుండటం వల్ల ఇప్పటికీ జిల్లాలో వైసీపీ చెప్పినట్లే అధికార యంత్రాంగం నడుచుకుంటోందని అంటున్నారు. తాజాగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను వాగ్వాదానికి దిగడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

జడ్పీ చైర్మన్ అలా మాట్లాడుతున్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు కామ్ గా కూర్చొంటే వైసీపీ నేతలు మరింత జోరుచూపుతారని, ఆ ఫలితం స్థానిక ఎన్నికలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల జోరుపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జిల్లాలో వైసీపీని రాజకీయంగా మాత్రమే అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో బొత్సను ఇరుకన పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఓ సీనియర్ నేతను రంగంలోకి దింపాలని చూస్తోంది.