Begin typing your search above and press return to search.

జగన్ కోటి చెక్కు....వైసీపీకి పెద్ద చిక్కు

అందువల్ల ఆయన వరదలలో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం కోసం ఈ విధంగా ఉదారతను చాటుకున్నారు అని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2024 3:07 PM GMT
జగన్ కోటి చెక్కు....వైసీపీకి పెద్ద చిక్కు
X

జగన్ కోటి రూపాయలు వరద బాధితుల సహాయార్ధం ఇస్తామని ప్రకటించారు. ఆయన ఏమైనా సామాన్యుడా వైసీపీ అధినేత, అంతే కాదు అయిదేళ్ల పాటు ఏపీని ఏలిన సీఎం. ఇపుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత. అందువల్ల ఆయన వరదలలో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం కోసం ఈ విధంగా ఉదారతను చాటుకున్నారు అని అంతా అనుకున్నారు.

అయితే రోజులు గడచినా జగన్ చేసిన ప్రకటన మేరకు ఆ కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఒక చర్చగా బయల్దేరింది. సోషల్ మీడియాలో అయితే దాని మీద రామ రావణ యుద్ధమే జరిగిపోతోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ జనసేన క్యాడర్ అంతా ఎక్కడికి కోటి సారూ అని జగన్ మీద విమర్శలు చేస్తున్నారు.

ఏపీని వరదలు కనీ వినీ ఎరగని తీరున వచ్చి అతలాకుతలం చేస్తున్న వేళ ఎందరో పెద్దలు ప్రముఖులు వ్యాపారస్థులు, అలాగే వివిధ రంగాలకు చెందిన వారు అంతా ప్రతీ రోజూ సీఎం రిలీఫ్ ఫండ్ కి తాము ప్రకటించిన మొత్తాలను చెక్కు రూపంలో ఇస్తున్నారు. మరి జగన్ చెక్కు ఎపుడూ అని కూడా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు

ఈ విధంగా వైసీపీ నేతలను కూడా ఎక్కడా విడవకుండా మీడియా ముఖంగానూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. దాని మీద సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తనదైన శైలిలో సమాధానం ఇచ్చేశారు. జగన్ ప్రకటించిన కోటి రూపాయలు అన్నది సీఈం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడానికి కాదు, మా పార్టీ తరఫున వరద బాధితులకు సహాయ సహకారాలు చేయడానికి అని ఆయన చెప్పేశారు.

మాకు క్యాడర్ ఉంది. పార్టీ ఉంది. అందువల్ల మేము ఆ మొత్తాన్ని ప్రజలకే నేరుగా వివిధ అవసరాల నిమిత్తం వెచ్చిస్తామని బొత్స అంటున్నారు. అంతే కాదు జగన్ ఇప్పటికే కోటి రూపాయలు సాయం అందించారని, అంతే కాదు మరో పది లక్షల రూపాయలు కూడా లేటెస్ట్ గా ఇచ్చారని బొత్స లెక్కలు చెప్పారు.

మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి నేరుగా చెక్కు ఇవ్వమని కూడా తెగేసి చెప్పారు. మా క్యాడర్ తో మా పార్టీ ద్వారానే ప్రజలకు మేము చేయాల్సిన సాయం చేస్తామని ఆదుకుంటామని బొత్స చెప్పడం విశేషం. సహాయ చర్యలను సొంతంగా నిర్వహించేందుకు తగిన సిబ్బంది సైన్యం మాకూ ఉన్నారని బొత్స సమర్ధించుకునే మాట్లాడారు.

అంతే కాదు జగన్ ప్రకటించిన కోటి రూపాయల సాయం ఇప్పటికే వరద బాధితులకు అందిందని ఆయన చెప్పారు. గత రెండు వారాలుగా వైసీపీ బాధిత ప్రజలకు ఆహారం, పాలు నీరు నిత్యావసరాలు ఇలా అన్నీ వైసీపీ పంపిణీ చేసిందని కూడా బొత్స చెప్పారు. ఈ విధంగా వైసీపీ సహాయం చేస్తోంది అని బొత్స సుదీర్ఘ వివరణే ఇచ్చారు.

దీనిని బట్టి చూస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎవరైనా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇవ్వడం ఒక ప్రామాణిక పద్ధతిగా ఇంతకాలం ఉందని వైసీపీ మాత్రం దానికి భిన్నంగా తనదైన విధానం ఎన్నుకుందని అంటున్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ అధికార పక్షానికి విపక్షాలు ఎపుడూ చెక్కులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అని అంటున్నారు. గతంలో తెలుగుదేశం కూడా తన మానాన సహాయ కార్యక్రమాలు చేస్తూ పోయింది. ఇపుడు వైసీపీ కూడా అంతే అని అంటున్నారు.

అయితే వరద బాధితులకు సహాయం విషయంలో మైలేజ్ కోసం కూడా ఇలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్ కోటి విరాళం ప్రకటించడమే ఇపుడు ఇంతటి వివాదానికి కారణమని అంటున్నారు. ఆయన ప్రకటించినా పార్టీ తరఫున చేస్తామని చెప్పి ఉంటే అది వేరేగా ఉండేదని కూడా అంటున్నారు.