రాజకీయాల్లో బొత్సది ఓ ట్రెండ్! అధికార పక్షంతో స్నేహం అందుకే..
వైసీపీలో బొత్స మార్కు రాజకీయం చూసిన వారు.. ఔను బొత్స స్టైలే వేరబ్బా.. అంటున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2025 4:30 PM GMTసీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు రూటే సెపరేటు. రాష్ట్రంలో ఇప్పుడున్న సీనియర్లలో బొత్స ఒకరు. ఉప్పు-నిప్పులా మారిన ప్రస్తుత రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తున్న బొత్స కొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. తాను ఎవరి రూట్లోనూ నడవనని, అంతా తన రూట్లోకే రావాలని సంకేతాలిస్తున్నారు. వైసీపీలో బొత్స మార్కు రాజకీయం చూసిన వారు.. ఔను బొత్స స్టైలే వేరబ్బా.. అంటున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, పీసీసీ సారథిగా పనిచేసిన బొత్స ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని వైసీపీ.. మండలిలో ఆ స్థానం నుంచి ప్రభుత్వంపై పోరాడాలని భావించింది. అందుకే గత ఎన్నికల్లో ఓడినా వెంటనే జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఇక ఆ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స కోసం అప్పటికే ప్రకటించిన ప్రతిపక్ష నేత హోదా నుంచి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించింది. దీంతో పార్టీలో బొత్సకు ప్రత్యేక గౌరవం ఉందని చెప్పినట్లైంది. అయితే ఇలా అనూహ్యంగా ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్న బొత్స ఇప్పుడు తనదైన మార్కు పాలిటిక్స్ తో అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయం ఓ ఫ్యాక్షనులా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులే కొనసాగాయి. వైరి పక్షాల నేతలు ఎక్కడ ఎదురైనా పలకరించుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక గత ఐదేళ్లలో విపక్షంపై తీవ్ర అణచివేత కొనసాగిందని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులమన్న సంగతి మరచిపోయి వ్యక్తిగత శత్రువులుగా మారిపోయారు. ఆ ఫలితాన్ని ఇప్పటికీ కొందరు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోగా, మండలిలో బలంతో ఆ హోదా దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష హోదాలో బొత్స అనుసరిస్తున్న వైఖరి కొడిగడుతున్న ఆశలను బతికిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రతిపక్ష నేత హోదాలో వైసీపీలో కేబినెట్ హోదా దక్కించుకున్న ఏకైక నేత బొత్స. మండలి సమావేశాల సందర్భంగా తన సమర్థత ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చూస్తున్న బొత్స ఇటీవల కాలంలో ప్రభుత్వ పెద్దలతో సామరస్యంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బొత్స మార్కు సామరస్యం వైసీపీలో మచ్చుకైనా కనిపించదనే విమర్శలు ఉన్నాయి. మనవాడు కాదంటే పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఆ పార్టీ తీరనే ఆరోపణలు గత ఐదేళ్లుగా వినిపించాయి. అలాంటి చోట బొత్స పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం ఆశ్యర్యానికి గురిచేస్తోందంటున్నారు.
మండలి సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆలింగనం చేసుకుని మేము మేము బాగానే ఉన్నామని సంకేతాలిచ్చిన బొత్స.. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ఎట్ హోం కార్యక్రమానికి వెళ్లి మంత్రి లోకేశ్ తో ముచ్చటించడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. అదేవిధంగా అడ్డదిడ్డమైన ఆరోపణలు, విమర్శల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన సమయంలో సూటిగా, స్పష్టంగా ప్రశ్నలు వేస్తూ ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు.
వైసీపీలో ఇలా సామరస్యంతో పనిచేయడంతోపాటు సందర్భానుగుణంగా నడుచుకోవడం బొత్సకు మాత్రమే చెల్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా మంది నేతలు పరుషంగా మాట్లాడితే పార్టీ అధినేత జగన్ కు నచ్చుతుందనే భ్రమలో స్థాయిని మించి మాట్లాడటంతోనే గత ఎన్నికల్లో పరాభవం ఎదురైందని పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్న వైసీపీ కార్యకర్తలకు సీనియర్ నేత బొత్స మార్కు రాజకీయం ఆకర్షిస్తోంది. ఈ ట్రెండును మిగతా నేతలు పాటిస్తే రాష్ట్రంలో పొలిటికల్ ఫ్యాక్షన్ అంతరిస్తుందని, తాము కూడా ప్రభుత్వంపై పోరాటానికి భయపడాల్సిన అవసరం ఉండదని కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.