Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల మీద బొత్స సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఏపీలో మూడు రాజధానులు ఉండాలని తన ప్రభుత్వ హయాంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   3 March 2025 6:00 PM IST
మూడు రాజధానుల మీద బొత్స సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ ఏపీలో మూడు రాజధానులు ఉండాలని తన ప్రభుత్వ హయాంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది అప్పట్లో జాతీయ స్థాయిలోనే సంచలనంగా మారింది. అంతటా విస్తృతంగా చర్చ కూడా జరిగింది. మూడు రాజధానులలో ఒకటి అమరావతిలో శాసన రాజధాని, రెండవది విశాఖలో కార్యనిర్వాహక రాజధాని మూడు కర్నూలులో న్యాయ రాజధానిగా విభజిస్తూ పాలనను వికేంద్రీకరించాలని వైసీపీ ఆనాడు నిర్ణయించడమే కాదు చట్టం కూడా సభలో చేసింది.

ఎపుడైతే అది న్యాయ సమీక్షకు వెళ్ళిందో హైకోర్టులో కేసు విచారణకు వచ్చిందో అంతే హడావుడిగా ప్రభుత్వం తాను చేసిన మూడు రాజధానుల చట్టాన్ని తానే రద్దు చేసింది. ఆ తర్వాత కూడా పెద్దగా మూడు రాజధానుల గురించి వైసీపీ మాట్లాడింది లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది ఒక ప్రధాన రాజకీయ అంశంగా ఉంటుందని అంతా భావించారు కానీ అలా జరగలేదు.

ఇక వైసీపీ దారుణమైన ఓటమి వెనక మూడు రాజధానుల మీద ఊగిసలాట, దాని విషయంలో చేసిన తప్పులు అవగాహన లోపం, నిబద్ధత ఏ ప్రాంతం మీద చూపించకపోవడం వల్లనే భయంకరమైన ఫలితాలు మూడింటా వచ్చాయని విశ్లేషణలు ఉన్నాయి. అయితే మూడు రాజధానుల మీద వైసీపీ ఇప్పటికీ సమాధానం సరిగ్గా ఇచ్చుకోలేని స్థితిలో ఉందనే అంటున్నారు.

శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడు రాజధానుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. దాని మీద అధికార కూటమి సభ్యులు వైసీపీ విధానాన్ని విమర్శించగా అది తమ విధానమని లీడర్ ఆఫ్ అపొజిషన్ గా బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. ఇక ఇదే అంశం మీద బయట మీడియాకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కోరుతూ తాము గతంలో మూడు రాజధానులు అంశాన్ని ముందుకు తెచ్చామని అన్నారు. అయితే అది ఆనాటిది అని బొత్స చెప్పడమే ఇక్కడ విశేషం. నా విధానం మూడు రాజధానులు అవసరమని సభలో చెప్పాను తాను అని బొత్స మీడియాకు వివరించారు. అదే సమయంలో ఆ రోజుకు మూడు రాజధానులు మా విధానం అని ఆయన చెప్పారు. ఈ రోజుకు మా విధనాం ఏమిటి అన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స అన్నారు.

ఆ రోజు మాట మూడు రాజధానులు అని బొత్స పదే పదే అన్నారు. అంటే ఈ రోజుకీ ఏపీ రాజధాని అంశం మీద వైసీపీకి ఒక స్పష్టత కానీ క్లారిటీ కానీ లేదా అన్నది చర్చగా ఉంది. మూడు రాజధానుల విషయం బూమరాంగ్ అయిన వేళ ఓడిన తొమ్మిది నెలల కాలంలో అయినా వైసీపీ దాని మీద చర్చ పెట్టుకోలేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అని ఎన్నికల ఫలితాల ద్వారా రుజువు అయింది. కూటమి ప్రభుత్వం కూడా మూడేళ్ళ కాల వ్యవధిలో అమరావతిలో భారీ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని కోసం వేగంగా నిధుల సమీకరణ జరుగుతోంది. మరి ఇంతా అయ్యాక కూడా వైసీపీ మూడునే పట్టుకుని కూర్చుందా లేక మూడ్ మార్చుకుందా అన్నదే చర్చగా ఉంది.

వైసీపీకి అత్యంత సంక్లిష్టమైన నిర్ణయంగా ఉన్న మూడు రాజధానుల విషయంలో వైసీపీ ఇప్పటికీ ఒక స్పష్టతకు రాకపోతే ఆ పార్టీకే ఇబ్బంది అని అంటున్నారు. అయితే వైసీపీ ఆలోచనలు ఇంకా అలాగే సజీవంగా ఉన్నాయా, కూటమి సర్కార్ అమరావతిని నిర్మించినా లేక నిర్మించకపోయినా అది తమకు రాజకీయ అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.

అమరావతిలో భారీ పెట్టుబడులు పెడితే మిగిలిన ప్రాంతాల వారిలో అసంతృప్తి రేగితే దానినే ఆయుధంగా చేసుకోవాలన్న ఆలోచనలు అయితే వైసీపీలో ఉన్నాయా అన్నది కూడా ఒక హాట్ డిస్కషన్ గా ఉంది. అయితే ప్రాంతీయంగా తమకు ఏమైనా అభివృద్ధి కావాలని ఎవరైనా కోరవచ్చు అని అమరావతి రాజధాని విషయంలో ఏపీ సర్వత్రా ఏకాభిప్రాయం ఉందన్న నిజాన్ని వైసీపీ ఎందుకు గ్రహించడంలేదు లేదా గ్రహించినా ఎందుకు అంగీకరించడం లేదూ అన్నది కూడా చర్చగా ఉంది.