Begin typing your search above and press return to search.

బొత్స కేరాఫ్ విశాఖ!

ఇదిలా ఉంటే బొత్స వచ్చే ఎన్నికల నాటికి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అంతే కాదు విశాఖ జిల్లా నుంచే తన భవిష్యత్తు రాజకీయాలను మొత్తం నడపాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 2:30 AM GMT
బొత్స కేరాఫ్ విశాఖ!
X

ఉత్తరాంధ్ర జిల్లాలలో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నది తెలిసిందే. ఆయన మాజీ మంత్రి, వైసీపీకి సంబంధించి శాసనమండలిలో అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఆ మధ్యన విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన విశాఖ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

ఆయన తనకంటూ సొంత ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నారు. క్రమం తప్పకుండా అక్కడ నుంచి ఆయన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విశాఖకు సంబంధించిన అనేక అంశాల మీద ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు.

ఇదిలా ఉంటే బొత్స వచ్చే ఎన్నికల నాటికి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అంతే కాదు విశాఖ జిల్లా నుంచే తన భవిష్యత్తు రాజకీయాలను మొత్తం నడపాలని చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి బొత్స సొంత నియోజకవర్గం.

అక్కడ నుంచి ఆయన అయిదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచారు. ఇక 2029 ఎన్నికల నాటికి అక్కడ నుంచి తన కుమారుడు బొత్స సందీప్ ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారు అలాగే గజపతినగరం తన తమ్ముడుకి కేటాయించేశారు. అలాగే తన అనుచరులు సన్నిహితులకు సీట్లు విజయనగరం జిల్లాలో ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక బొత్స తనతో పాటు తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని కూడా విశాఖ జిల్లాకు తీసుకుని వచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే లేటెస్ట్ గా వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. అందులో భీమునిపట్నం నుంచి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు ఇంచార్జి బాధ్యతలను అప్పగించింది.

ఈ సీటు నుంచి నెల క్రితం వరకూ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంచార్జిగా ఉండేవారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో మజ్జి శ్రీనివాసరావుతో ఈ ఖాళీని వైసీపీ అధినాయకత్వం భర్తీ చేసింది. ఇంచార్జి అంటే 2029 ఎన్నికలలో ఆయన భీమిలీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు.

ఇక భీమిలీకి విజయనగరానికి మధ్య ప్రాంతాల వారీగా చూస్తే సన్నిహిత సంబధాలే ఉన్నాయి. విజయనగరం భీమిలీ పక్కపక్కనే ఉంటాయి. అంతే కాదు రాజకీయంగా సామాజికవర్గాల పరంగా రెండు చోట్లా ఒకే విధంగా ఉంటుంది. బొత్స సామాజికవర్గం కూడా భీమిలీలో అధికంగా ఉంటుంది.

దాంతో అక్కడ వైసీపీ గెలిచేందుకు మార్గం సుగమం అవుతుందని వైసీపీ హైకమాండ్ ఎంచి మరీ మజ్జి శ్రీనివాసరావుని పంపించింది అని అంటున్నారు. బొత్స కూడా తనతో పాటు మేనల్లుడు ఉంటే విశాఖ లోక్ సభకు తాను ఎమ్మెల్యేగా ఆయన పోటీకి లైన్ క్లియర్ చేసుకున్నట్లు అవుతుందని ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

అంతే కాదు విశాఖ జిల్లాలో అనేక నియోజకవర్గాలలో కూడా మార్పుల వెనక బొత్స వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి బొత్స విశాఖ నుంచే తన పాలిటిక్స్ ని గట్టిగా చేయడానికి డిసైడ్ అయ్యారని అంటున్నారు. వైసీపీకి చూస్తే బలమైన నాయకత్వం విశాఖ జిల్లాలో లేకపోవడంతో బొత్సకు అది అడ్వాంటేజ్ గా మారుతోంది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో బొత్స రాజకీయం ఏ విధంగా పదును తేరుతందో.