Begin typing your search above and press return to search.

మండలిలో రుషికొండ... ఢీ అంటే రెడీ!

మండలిలో వైసీపీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ గా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.

By:  Tupaki Desk   |   3 March 2025 4:50 PM IST
మండలిలో రుషికొండ... ఢీ అంటే రెడీ!
X

శాసనమండలిలోనే బడ్జెట్ సమావేశాలు రాజకీయ రచ్చను రేపుతున్నాయి. మండలిలో వైసీపీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ గా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన అధికార టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తనదైన అనుభవంతో ఇరుకున పెడుతున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం జరిగిన మండలి సమావేశంలో విశాఖ రుషికొండ భవనాల వ్యవహారం మీద అధికార విపక్షాల మధ్య మాటల మంటలే చెలరేగాయి. ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విపర్శించారు. దాంతో అధికార కూటమి నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది విశాఖలో రుషికొండ భవనాలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయలేదా అని కూటమి పక్షం నుంచి విమర్శలు వచ్చాయి.

దానికి బొత్స బదులిస్తూ రుషికొండ భవనాల విషయంలో అవినీతి జరిగింది అన్నది కనుక ఉంటే సమగ్రమైన విచారణ జరిపించాలని సవాల్ చేశారు. తప్పు ఎవరు చేసినా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ఆయన కోరారు. అంతే తప్ప రుషికొండ మీద అవినీతి అని చెప్పడం బురద జల్లి పోవడమేంటి అని ఆయన నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భవనంగా దానిని నిర్మించామని కూటమి ప్రభుత్వం దానిని వాడుకోలేకపోతోందని బొత్స ఎద్దేవా చేశారు. రుషికొండ మీద పర్యావరణం దెబ్బ అని అంటున్నారని అంతకు ముందు అక్కడ టూరిజం వారి హరితా భవనాలు కట్టించలేదా అని ప్రశ్నించారు. రుషికొండ భవనాలను నిర్మించిన కాట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారని ఆయన ప్రశ్నించారు.

దానికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ రుషికొండ భవనాలకు చెల్లింపు కాదని అదే కాంట్రాక్టర్ వేరే పనులు చేసినందున వాటికి మాత్రమే వంద కోట్లు చెల్లించామని చెప్పారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని అందుకే వైసీపీ హయాంలో నిర్మాణాలు చేసినా బిల్లులు చెల్లించామని అన్నారు.

ఇదిలా ఉంటే అమరావతి సచివాలయం ఇతర భవనాలు తాత్కాలికమైనవి అని వాటి కోసం అప్పట్లో 10 లక్షల కోట్ల రూపాయలు చెల్లించి కట్టడం ప్రజా ధనం వృధా కాదా అని బొత్స ప్రశ్నించారు. తాత్కాలిక భవనాలు అని ఎవరు చెప్పారని కూటమి సభ్యులు నిలదీశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం శాశ్వత భవనాలు వేరే చోట టెండర్లు పిలిచినపుడు ఇవి తాత్కాలికమైనవి అవుతాయి కదా మీరే అంతా చేస్తూ చెబుతూ మమ్మల్ని అంటారేమిటి అని బొత్స అన్నారు.

ఈ భవనాలూ ఉంటాయి ఆ భవనాలూ ఉంటాయి. రెండూ ప్రభుత్వానివే రెండూ శాశ్వతమైనవే అని కూటమి నుంచి మంత్రులు బదులిచారు. పెద్ద ఇల్లు చిన్న ఇల్లు మాదిరిగా ఇన్ని కట్టడాలూ ఇన్ని భవనాలూ అవసరమా అని బొత్స నిలదీశారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేయడం భావ్యమా అని కూడా ప్రశ్నించారు. మరి ప్రజా వేదిక ప్రజల సొమ్ముతో కట్టినదే కదా దానిని ఎందుకు కూల్చారు అని టీడీపీ ఎమ్మెల్సీ అనూరాధ విపక్ష వైసీపీని ప్రశ్నించారు. ఇలా సభలో బడ్జెట్ మీద చర్చ కంటే ఇతర అంశాలు రాజకీయ ప్రస్తావనలు సవాళ్ళూ ప్రతిసవాళ్ళ మీదనే చర్చ సాగడం విశేషం.

మరో వైపు చూస్తే సభ నుంచి బయటకు వచ్చిన బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పలేక మండలిలో కుప్పిగంతులు వేసిందని విమర్శించారు. అవినీతి చేశామని వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని దేని విషయంలో అవినీతి జరిగిందో విచారణ జరిపించడంలో ఎందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. తాము ప్రజల పక్షంగా ఉంటామని సభలో కూటమి సర్కార్ విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. చట్ట సభలను రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వ పెద్ద వినియోగించుకోవాలని చూస్తే తాము వారిని నిలువరిస్తామని ఆయన అన్నారు.