Begin typing your search above and press return to search.

బొత్స అడుగుపెట్టిన వేళ మండలిలో వైసీపీ సీన్ ఏంటి ?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లక్కీ అని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 9:30 PM GMT
బొత్స అడుగుపెట్టిన వేళ మండలిలో వైసీపీ సీన్ ఏంటి  ?
X

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లక్కీ అని అనుకున్నారు. ఆయనకు ఓటమి చెందినా రెండు నెలలు తిరగకుండానే శాసనమండలిలో ఎమ్మెల్సీగా చాన్స్ దక్కిందని దాంతో పాటే మండలిలో ప్రతిపక్ష నేత బాధ్యతలు కూడా లభించాయని కూడా భావించారు. కేబినెట్ ర్యాంక్ పదవి వైసీపీలో బొత్సకే దక్కింది అని అంతా అనుకున్నారు.

అయితే ఆ సంతోషం మూడు నాళ్ల ముచ్చటేనా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే టీడీపీ కూటమి వైసీపీ ఎమ్మెల్సీలని టార్గెట్ చేసింది. దంతో పోతుల సునీత ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మిగిలిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు అక్టోబర్ లో జరుగుతాయని అంటున్నారు.

అప్పటికి అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నా మండలిలో మద్దతు సరిపోదు. దాంతో మండలిలో ఆధిక్యతం సాధించాలంటే ఇపుడు కూటమికి ఉన్న 11 మంది ఎమ్మెల్సీలకు తోడుగా మరో ఇరవై మంది దాకా అవసరం పడుతారు అని భావిస్తున్నారు.

దాంతో కూటమి వైసీపీని మండలిలో చీల్చేందుకు భారీ వ్యూహ రచనతో ఉంది. అందులో భాగంగా మెజారిటీ ఎమ్మెల్సీలను వైసీపీ నుంచి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కనుక జరిగితే శాసన మండలిలో వైసీపీ మైనారిటీలో పడుతుంది. అప్పుడు అక్కడ టీడీపీకి బలం చేకూరుతుంది.

అయితే మండైలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలలో 30 మంది ఉంటే ఆ పార్టీకి మెజారిటీ వచ్చినట్లు. అలా చూసుకుంటే వైసీపీ నుంచి కనీసంగా 20 మంది దాకా ఎమ్మెల్సీలను టీడీపీ కూటమి ఆపరేషన్ ఆకర్ష్ పేరిట లాగాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే వైసీపీకి మండలిలో బలం దారుణంగా పడిపోతుంది అని అంటున్నారు.

మండలిలో బొత్స అపొజిషన్ లీడర్ గా కొనసాగాలంటే ఆరుగురు ఎమ్మెల్సీల మద్దతు సరిపోతుంది. ఎందుకంటే పది శాతం మొత్తం సభ్యులలో అదే నంబర్ అవుతుంది కాబట్టి. ఆ విధంగా చూస్తే బొత్సకి మండలిలో అపొజిషన్ లీడర్ గా కేబినెట్ ర్యాంక్ కి ఇబ్బంది లేకపోయినా బాగా తగ్గిపోయిన మండలిలో ఆయన ఏ మేరకు ప్రభావం చూపిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

ఇంకో వైపు చూస్తే బొత్స వంటి బలమైన నాయకుడిని మండలిలో పార్టీ లీడర్ గా వైసీపీ ఎంపిక చేసిన నేపధ్యంలో ఆయన ఎంతవరకూ ఈ ఆపరేషన్ ఆకర్ష్ ని అడ్డుకుని వైసీపీ ఎమ్మెల్సీలను కాపాడుకోగలుతారు అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా చూస్తే మండలిలో వైసీపీకి మంట పుట్టించే సంఘటనలు చోటు చేసుకోవడం ఖాయమనే అంటున్నారు.