వైసీపీకి సవాల్ : బొత్స ఫీల్డ్ లోకి దిగితేనే..?
వైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణకు ఇపుడు పెద్ద పని పడింది.
By: Tupaki Desk | 5 Nov 2024 3:33 AM GMTవైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణకు ఇపుడు పెద్ద పని పడింది. ఆయన సొంత జిల్లాలో ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికల కోసం వైసీపీ సర్వం సిద్ధంగా ఉందా అంటే బొత్స పూనుకుంటేనే అది అని అంటున్నారు.
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో 2021లో జరిగిన ఎన్నికల్లో రఘువర్మ గెలిచారు. ఆయన ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని కాదని టీడీపీ అభ్యర్ధిని సపోర్టు చేశారు అన్న కారణంతో ఆయన మీద అనర్హత వేటు వేయించారు. అలా వచ్చిపడింది ఈ ఉప ఎన్నిక.
2027 చివరి దాకా ఈ పదవీ కాలం ఉంది. అంటే ఇపుడు నెగ్గిన వారు మరో మూడేళ్ల పాటు దర్జాగా ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉండవచ్చు పైగా విజయనగరం జిల్లాలో వైసీపీకి లోకల్ బాడీస్ లో పూర్తి మెజారిటీ ఉంది. మొత్తం లోకల్ బాడీస్ లో ఓటర్లు 753 మంది ఉన్నారు. ఇందులో 548 మంది వైసీపీకి చెందిన వారు ఉన్నారు. అంటే మూడింట రెండు వంతులు అన్న మాట. ఇక టీడీపీకి చెందిన వారు 156 మంది ఉంటే జనసేనకు చెందిన వారు 13 మంది ఉన్నారు. అలాగే ఏ పార్టీకి చెందని ఇండిపెండెంట్లు 22 మంది దాకా ఉన్నారు.
ఇక చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కొంతమంది లోకల్ బాడీస్ కి చెందిన ప్రజా ప్రతినిధులు వెళ్ళిపోయారు. ఇలా ఎంత మంది వెళ్ళినా ఈ రోజుకీ మెజారిటీ వైసీపీకే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలి అన్నా 375 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అంటే నూరు శాతం ఓటింగ్ పడినప్పుడు. అలా కాకున్నా 350 ఓట్లు వచ్చినా గెలుపు బాటలో నడచినట్లే.
వైసీపీకి ఉన్న 548 మందిని కనుక చూసుకుంటే అవసరం అయిన దాని కంటే 200 మంది లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల మద్దతు అధికంగా ఉంది. ఇందులో నుంచి పెద్ద సంఖ్యలో లాగేసేలా కూటమి ప్లాన్ చేసినపుడే విజయం ఆ వైపునకు మారుతుంది. ఇదిలా ఉంటే ఈ నంబర్ పెద్దదిగా ఉన్నా విజయం ఎవరు సాధిస్తారు ఎవరికి పట్టుదల ఉంది అన్నది కూడా కీలకం అవుతుంది.
విజయనగరం జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ ఫీల్డ్ లోకి దిగితేనే వైసీపీ వైపు ఉండే వారు కొనసాగుతారు. లేకపోతే కాడె వదిలేసినట్లుగా భావించి తమకు నచ్చిన తీరుగా వ్యవహరిస్తారు అని అంటున్నారు.
ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం కూడా అలెర్ట్ కావాల్సి ఉంది. అయితే బొత్స ఇటీవల కాలంలో కొంత సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన గతంలో మాదిరిగా దూకుడు చేయడం లేదు. ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు కాబట్టి ఆయన ఈ ఎన్నికలు చూసుకుంటారు అని వదిలేస్తే మాత్రం అపుడు ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.
ఎవరు ఎక్కడ నుంచి వచ్చి పర్యవేక్షణ చేసినా లోకల్ గా బలమైన నాయకులు అండగా నిలిస్తేనే విజయం సాధ్యమవుతుంది అలా చూసుకుంటే కనుక బొత్స ధీటుగా నిలబడితేనే ఫ్యాన్ ఈ జిల్లాలో గిర్రున తిరిగి విజయం చవి చూస్తుంది అని అంటున్నారు. ఈ నెల 28న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా ఇరవై రోజులు మాత్రమే ఉంది. వ్యూహాన్ని రూపొందించుకుని వైసీపీ బరిలోకి దిగితేనే ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.