Begin typing your search above and press return to search.

తమ్మినేనితో బొత్స మంత్రాంగం....మాజీ స్పీకర్ క్లారిటీ!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న నాయకులు అందరి కంటే ముందే ఎమ్మెల్యే అయ్యారు

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:05 AM GMT
తమ్మినేనితో బొత్స మంత్రాంగం....మాజీ స్పీకర్ క్లారిటీ!
X

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న నాయకులు అందరి కంటే ముందే ఎమ్మెల్యే అయ్యారు. అదీ కూడా 1983లో. ఆయనకు సమకాలీనుడు ఎవరు అంటే ఒక్క కళా వెంకట్రావు అనే చెప్పాల్సి ఉంది. ఇక కళా విజయనగరం జిల్లాకు షిఫ్ట్ అయ్యారు.

దాంతో తమ్మినేని సీనియారిటీ ఇప్పుడు అధికంగా ఉంది. కానీ రాజకీయంగా ఎంత అనుభవం ఉన్నా సరైన అవకాశాలు లేనపుడు ఎవరైనా డీలా పడాల్సిందే. అలా వైసీపీ ఘోర ఓటమి తరువాత తమ్మినేని కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆముదాలవలస నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన్నే ఇంచార్జిగా చేయాలని కోరుతుంటే అధినాయకత్వం మాత్రం చింతాడ రవికుమార్ అనే ఒక ద్వితీయ శ్రేణి నేతకు అవకాశం ఇచ్చింది.

దాంతో తమ్మినేని అలిగారు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు మరో వార్త దావానలంగా వ్యాపించింది అదేంటి అంటే ఆయన జనసేనలో చేరిపోతారు అని. ఆయన సతీమణి వాణి సర్పంచుగా ఉన్నారు. ఆమెతో పాటు కుమారుడు చిరంజీవి నాగ్ అంతా కలసి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారు అన్న వార్తలు వైసీపీలో కలకలం రేపాయి.

ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీ అధినాయకత్వం అప్రమత్తం అయింది. శాసనమండలిలో విపక్ష నేత సీనియర్ నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ తాజాగా తమ్మినేని ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడడంతో అధినాయకత్వం ఆయనను పంపించిందా అన్న చర్చ అయితే వస్తోంది.

ఈ భేటీ తరువాత బొత్స తాను తమ్మినేని కుమారుడికి సర్జరీ అయిన సందర్భంగా ఆయనను పరామర్శించడానికి వచ్చాను అని చెప్పారు. అయితే తమ్మినేని మాట్లాడుతూ తాను వైసీపీ వీడిపోవడం లేదని స్పష్టం చేశారు. జనసేనలోకి తాను వెళ్లేది లేదని కూడా తెలియజేశారు.

తాను ఎప్పటికీ వైసీపీతోనే ఉంటాను అని చెప్పారు. అయితే తమ్మినేని ఈ విధంగా మాట్లాడటం వెనక ఏమి జరిగి ఉంటుందని కూడా చర్చ సాగుతోంది. అధినాయకత్వం తరఫున బొత్స తమ్మినేనికి ఏమైనా రాయబారం తెచ్చారా అని కూడా అనుకుంటున్నారు ఆముదాలవలస ఇంచార్జిగా తమ్మినేని కుమారుడికి చాన్స్ ఇస్తున్నారా అన్న దాని మీద కూడా అంతా చర్చిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ నెరపిన రాజకీయ మంత్రాంగంతో తమ్మినేని వంటి బిగ్ షాట్ వైసీపీని వీడకుండా బ్రేకులు వేసిందని అంటున్నారు. తమ్మినేని కనుక వైసీపీని వీడితే ఆ ప్రభావం జిల్లాలోని బలమైన ఒక సామాజిక వర్గం మీద కూడా తీవ్రంగా పడేదని అంటున్నారు. సరైన సమయంలో వైసీపీ అలెర్ట్ అయిందని చెబుతున్నారు. ఏది ఏమైనా వైసీపీ హై కమాండ్ ఇదే తీరున వ్యవహరిస్తే సీనియర్లు కానీ ముఖ్య నాయకులు కానీ పార్టీని వీడిపోకుండా ఉంటారని అంటున్నారు. అలా కాకుండా వెళ్ళిన వారు ఎవరైనా సరే అన్నట్లుగా ఉంటే మాత్రం ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులే అంటున్నారు.