సతీమణి కోసం ఫీల్డ్ లోకి దిగిపోయిన మంత్రి గారు...!
తన సతీమణి దాదాపుగా పదేళ్ళ తరువాత ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. పైగా ప్రైమ్ సీటు.
By: Tupaki Desk | 2 April 2024 4:10 AM GMTతన సతీమణి దాదాపుగా పదేళ్ళ తరువాత ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. పైగా ప్రైమ్ సీటు. విశాఖ లాంటి మెగా సిటీలో ఎంపీ అంటే మామూలు విషయం కాదు. ఆ గోల్డెన్ చాన్స్ ఇపుడు కళ్ళ ముందు ఉంది. దాంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఆయన చీపురుపల్లిని అలా వదిలేశారు. అక్కడ గెలుపు గ్యారంటీ అని ఆయన మాటలలోనే వ్యక్తం అవుతోంది. రోజుకో మీడియా మీటింగ్ ఆ మీదట పార్టీ జనాల మీటింగ్ ఇలా విశాఖలోనే మంత్రి గారు గడిపేస్తున్నారు.
ఆయనను మీడియా అడిగిన ప్రశ్న ఏంటి అంటే చీపురుపల్లిలో మీ మీద మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పోటీ చేస్తున్నారు కదా అంటే గంటా అన్న మూడక్షరాల నుంచి కళా అన్న రెండు అక్షరాలకు పేరు మారింది. ప్రత్యర్ధి ఎవరైతేనేమి అంటూ లైట్ తీసుకున్నారు. దీనిని బట్టి చీపురుపల్లిలో పక్కాగా గెలుస్తాను అని బొత్స భావిస్తూ విశాఖ ఎంపీ సీటులో సతీమణిని కూర్చోబెట్టేందుకు తనదైన స్కెచ్ ని గీస్తున్నారు.
దానికి గానూ ఆయన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కోటిగా తీస్తున్నారు. అందులో ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ. ఈ విషయంలో కూటమి పెద్దలు జవాబు చెప్పి ప్రచారానికి రావాలని ఒక లక్షణ రేఖ గీశారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని బీజేపీ నోట చెప్పించాలని షరతు విధించారు.
ఆ తరువాత చూస్తే రెండవది మరో పవర్ ఫుల్ కార్డు తీశారు. నాన్ లోకల్స్ కి విశాఖ ఉత్తరాంధ్రా రాజకీయాలతో పనేంటి అన్నది బొత్స బిగ్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ విశాఖ వస్తున్న వారు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా ఈ ప్రాంతానికి తెలిసిన వారా లేక ఏమైనా మేలు చేసారా అని బొత్స తెలివిగానే ప్రశ్నిస్తున్నారు.
ఈ మొత్తం విషయాలు చూస్తే బీసీ కార్డు లోకల్ కార్డుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ని వాడుకుని వైసీపీని గెలిపించాలని బొత్స చూస్తున్నారు అని అర్ధం అవుతోంది. అయితే ఆయన కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలని కూటమి పెద్దలు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద బొత్స గతంలో ఎపుడైనా మాట్లాడారా అని నిలదీస్తున్నారు.
ఆయన ప్రభుత్వం అయిదేళ్ళూ అధికారంలో ఉంది కదా మరి ఆ ప్రభుత్వం ఏమైనా ఆపే ప్రయత్నం చేసిందా అని అంటున్నారు. అంతే కాదు తమ పార్టీలోనూ నాన్ లోకల్స్ కి టికెట్ ఇస్తూ వారిని పక్కన పెట్టుకుని మిగిలిన పార్టీల మీద ఆ ముద్ర ఎలా వేస్తారు అని అడుగుతున్నారు మొత్తానికి బొత్స మాత్రం ఫీల్డ్ లోకి దిగి తన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు.
అయితే ఆయన చేసేది విజయనగరం జిల్లా రాజకీయాలు. అవి విశాఖ వంటి కాస్మోపాలిటిన్ సిటీలో ఎలా సెట్ అవుతాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా బొత్సకు తన సతీమణి బొత్స ఝాన్సీ గెలుపు ఒక ప్రతిష్ట గా మారింది అని అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్నది చూడాలని అంటున్నారు.